చేర్యాల, మార్చి 21 : ఏ చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా దానికి అనుమతులు తప్పనిసరి, అటువంటిది చిన్నతరహా పరిశ్రమగా పిలుచుకునే ఇటుకబట్టీల నిర్వహణకు ఎటువంటి అనుమతులు తీసుకోవడం లేదు. ఈ బట్టీలలో ఉపయోగించే ముడిపదార్ధాల వల్ల ప్రకృతికి విఘాతం కలుగుతుంది. ఇటుకబట్టీలు నిరంతరం కాలుష్యాన్ని వెదజల్లడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి కూడా నిర్వాహుకులు గండి పెడుతున్నారు. ఇటుకబట్టీలతో సమాజానికి హాని కలుగుతుందని బట్టీల నిర్వహణను నిబంధనల ప్రకారం పరిశ్రమల శాఖ వారు అనుమతించరు. ఎటువంటి అనుమతులు లేకుండా యధేచ్చగా నిర్వహిస్తున్న ఇటుకబట్టీల నిర్వహణ చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలలో కొనసాగుతున్నది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా తదితర జిల్లాలకు చెందిన వ్యాపారులు చేర్యాల, కొమురవెలి,మద్దూరు ఉమ్మడి మండలాలలోని పలు గ్రామాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి ఇటుకలు తయారు చేసి విక్రయిస్తున్నారు. గ్రామాల్లో సమీపంలో బీటీ రోడ్డుకు పక్కనే ఉన్న రైతుల వ్యవసాయ భూముల్లో రెండు రకాలుగా ఇటుక బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు. లైట్ వెయిట్ ఇటుక, నెంబర్ ఇటుకల పేరిట బట్టిలు ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. ఎర్ర భూములున్న రైతులను కలిసి కొన్ని సంవత్సరాల పాటు కౌలు తీసుకుని దానిని మొదటగా చదును చేస్తున్నారు. అనంతరం అదే భూమిలో నుండి ఎర్రమన్ను తీసి ఇటుకలు తయారు చేస్తున్నారు. కాగా వ్యవసాయ పోలాల వద్ద 24 గంటల ఉచిత కరెంటును వీరు వినియోగించుకుంటున్నారు.
చేర్యాల పట్టణంలోని తూర్పు గుంటూరుపల్లెకు వెళ్ళే రహాదారి పక్కన పది ఎకరాల్లో ఇటుక బట్టిలు ఏర్పాటు చేసి దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట గ్రామ ప్రభుత్వ పాఠశాల సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో కొనసాగుతున్నది. దీనికి ఒక వైపు పాఠశాల మరో వైపు నివాసిత ప్రాంతం ఉంది. లెనిన్‌నగర్ గ్రామంలో జనగామ-సిద్దిపేట ప్రధాన రహాదారిపై పదుల సంఖ్యలో ఇటుకబట్టీలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సైతం ప్రభుత్వ పాఠశాల, నివాసిత ప్రాంతాలకు సమీపంలో బట్టీలు ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. అలాగే కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి సిద్దిపేట మీదుగా వచ్చే రహాదారిలో సైతంబట్టీలు నిర్వహిస్తుండడం వల్ల బట్టీలోంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళితో మల్లన్న భక్తులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసిత, పాఠశాల ప్రాంతంలో బట్టీ ఉండడంతో దుమ్మ, ధూళితో ఆహార పదార్ధాల పాడైపోతున్నాయి. కొందరికి ఆయాసం, దగ్గు వచ్చి ఊపిరికి కష్టం ఉంటుంది. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలలోని పలు గ్రామాల్లో ఇటుక బట్టీలు ఏలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు. నీటి సౌకర్యం ఉన్న చోట, నీరు, విద్యుత్, బంకమట్టి, రహాదారి సౌకర్యం ఇండే చోట నిర్వహణ సాగుతున్నది.
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా ల్యాండ్ కన్వర్షన్ తీసుకోవాలి, ఇటుక బట్టీల నిర్వహణ సీజనల్‌గా ఉంటుంది. దీనికి వన్‌టైం ల్యాండ్ కన్వర్షన్ తీసుకుంటే సరిపోతుంది. కాని ఇటుకబట్టీల నిర్వాహకులు ల్యాండ్ కన్వర్షన్ తీసుకోకుండానే బట్టీలను నిర్వహిస్తున్నారు. ల్యాండ్ కన్వర్షన్ తరువాత ఏ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్నారో ఆ పంచాయతీ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బట్టీలలో తయారు చేసే ఇటుకల సామర్ధంను బట్టి పన్నులు చెల్లించాలి. బట్టీల నిర్వాహకులు పంచాయతీ అనుమతి తీసుకోకపోగా పంచాయతీలకు ఎటువంటి పన్నులు చెల్లించడం లేదని పంచాయతి అధికారులు వాపోతున్నారు. బట్టీలలో నీటి కోసం విద్యుత్ మోటర్లు వినియోగిస్తారు. రాత్రి పూట కూలీలు పనులు చేసేందుకు దీపాలను వెలిగిస్తారు. వీటికి విద్యుత్ అవసరం.అయితే బట్టీల యజమానులు విద్యుత్ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే విద్యుత్‌ను ఆయా గ్రామాల్లో వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అటవిశాఖ నియమ,నిబంధనల మేరకు సహజవనరుల రక్షణ, భూమి, నీటి వనరులను కాపాడడం, చెట్టు నరికివేతను అడ్డుకోవడం, కాని ఇటుక బట్టీల కోసం బంకమట్టి సేకరణ, వంట చెరుకు కోసం చెట్టను ఇష్టానుసారంగా నరికివేసి బట్టీలలో వేసి కాలుస్తు నిబంధనలకు తూట్లు పెడుతున్నారు.దీనికి తోడుగా బట్టీలలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం నిర్వాహుకులు ఎలాంటి వసతులు కల్పించడం లేదు, చిన్నారులు సైతం బట్టీలలో పనులు చేస్తున్నారు.కార్మిక శాఖ అధికారులు సైతం వారికి అండగా ఉంటున్నారు.ఇటుక బట్టీలలో సుమారు లక్ష ఇటుకలను ఒక బట్టీగా పేర్చి ఒకేసారి కాలస్తుంటారు.అది కాస్తా వారం, పది రోజుల పాటు కాలుతుంది. దానికి వరిపొట్టు, వంట చెరుకు అవసరం, వారం, పది రోజుల పాటు బట్టీలలో మంటలు వస్తుండడంతో ఆ ప్రాంతంలోని భూమి పోరలు వేడుక్కుతాయి.పక్కనే ఉన్న మొక్కలు చనిపోతాయి. భూగర్భజలాలు అడుగంటుతుంటాయి, దీంతో భూ కాలుష్యం పెరిగిపోతుంది.ఇటుకబట్టీల నిర్వహణ వల్ల ప్రధానంగా గాలి కాలుష్యం ఎక్కువుగా ఉంటుంది. బట్టీలలోంచి దుమ్మ, దూళి, పొగ విపరీతంగా వస్తుంటాయి. వాటి వల్ల ప్రజలకు, వాహనదారులకు అనారోగ్య పరిస్ధితులు తలెత్తుతున్నాయి. బట్టీలోంచి గాలి ఎంతవరకు వ్యాపిస్తుందో, ఆ ప్రాంతం మొత్తం కాలుష్యంగా మారుతుంది. ఆ ప్రాంత ప్రజలు ఆనారోగ్యం పాలవుతుంటారు.