మెదక్, జూన్ 27(నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రాలివ్వాలని ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా ఇన్చార్జిలు బొజ్జ సైదులు మాదిగ, బుంజురు విజయ్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. జూలై 7వ తేదీన 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రతి మండలం, గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో రాజీలేని పోరాటం చేసి విజయం సాధించామ న్నారు.
అన్ని శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చెట్లపల్లి యాదగిరి, మురళి, సీనియర్ నాయకులు కొమ్ముశేకులు, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు బాలరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మలిశెట్టి రవి, అధికార ప్రతినిధి కన్నీటి సుధాకర్, ఉపాధ్యక్షులు ఎరుపుల పరమేశ్, స్వామి, మస్కూరి వెంకన్న, పాతూరి రాజు, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పల్లెపాటి మాధవి పాల్గొన్నారు.