అమీన్పూర్, జూలై 1: సంగారెడ్డి జిలా పటాన్చెరు మండలంలోని పాశమైలారం వద్ద గల సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో సుమారు 50 పైగా కార్మికులు మృతిచెందగా,అనేక మంది తీవ్రగాయాల పాలైన విషయం తెలిసిందే. మంగళవారం మృతదేహాలను పటాన్చెరు దవాఖానకు తరలించి పోస్టుమార్టం చేశారు. అనంతరం పలు మృతదేహాలను గుర్తించి కుటుంబీకులకు అప్పగించడంతో పాటు వారివారి స్వస్థలాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. సోమవారం రాత్రివరకు 36 శవాలను గుర్తించి పోస్టుమార్టం కోసం పటాన్చెరు ఏరియా దవాఖాన మార్చురీకి చేర్చారు. మంగళవారం ఉదయం నుంచి వైద్యులు మృతదేహాల పోస్టుమార్టం ప్రక్రియ చేపడుతూ, ఆ మృతదేహాల గుర్తింపు పనిలో పడ్డారు.అందులో 36 మృతదేహాలకు 11 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు గుర్తించడంతో వారికి అప్పగించి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. మిగతా 18 మృతదేహాల ఆచూకీ తెలిసినప్పటికీ, వారి సంబంధీకులు రాకపోవడంతో మార్చురీలో భద్రపర్చారు. మిగతా 7 మృతదేహాల ఆచూకీ ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు.
సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘటనలో మృతిచెందిన మరో 20 మంది కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్చెరు దవాఖానకు తీసుకురానున్నట్లు తెలిసింది. వైద్యులు పోస్టుమార్టం కోసం సిద్ధం చేస్తున్నారు.
మృతదేహాల తరలింపు ప్రక్రియ మందకొడిగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11 గంటలకు పలు మృతదేహాలను బాధిత కుటుం బీకులు గుర్తించినప్పటికీ, బంధువులకు అప్పగింతలో నిర్లక్ష్యం వహించారు. అంబులెన్సుల్లో మృతదేహాలను పెట్టి గంటల తరబడి నిలబెట్టి కాలయాపన చేయడంతో కుటుంబీకులంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంత ఆల స్యం ఎందుకని అడిగితే సీఎం కాన్వాయ్ బయలుదేరుతుందని, వారు వెళ్లిన తర్వాత పంపిస్తామంటూ సమాధానం ఇచ్చినట్లు బాధితులు ఆరోపించారు. పటాన్చెరు దవాఖాన వద్ద మంగళవారం మృతుల కుటుంబాలు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.
అమీన్పూర్ పరిధిలోని బీరంగూడ మల్లారెడ్డి కాలనీలో శ్రీనివాస ప్లాజాలో నిఖిల్ రెడ్డి ఆరేండ్లుగా మా పక్క ప్లాట్‌లో ఉండేవారు. నిఖిల్‌రెడ్డి మా కుటుంబంలో సభ్యుడిగా ఉండేవారు. రెండు నెలల క్రితం శ్రీరమ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అందుకు వారి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సర్దిచెప్పి వారి వివాహం ఇంటి పెద్దల వలే ఉండి మా అమ్మ చేసింది. అంతలోనే వారిద్దరు ఈ దుర్ఘటనలో మృతి చెందడం దురదృష్టం. ఎంతో బాధగా ఉంది.
– రజిత (మృతులు శ్రీరమ్య నిఖిల్ రెడ్డి కుటుంబ స్నేహితురాలు)
నేను పుట్టకముందే 35 ఏండ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ ప్రాంతం నుంచి పటాన్చెరు ప్రాంతంలోని ఇస్నాపూర్‌కు మా తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం వలస వచ్చారు. కొన్ని నెలల క్రితం నుంచి సిగాచీ పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ బతుకు కొనసాగిస్తున్నాడు. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి విద్యాభ్యాసం చేశాను. నాకు అమ్మ, ముగ్గురు అక్కలు ఉన్నారు. ఇకపై వారి బాధ్యతలు అన్ని నాపై పడ్డాయి.
– ఉమేశ్‌కుమార్ (మృతుడు జగదీశ్ ప్రసాద్ కొడుకు)
ఉత్తరప్రదేశ్‌లోని జోన్పూర్ జిల్లా సోనుపురా గ్రామం నుంచి 15 ఏండ్ల క్రితం వచ్చి ఇస్నాపూర్‌లో స్థిరపడ్డాము. అఖిలేష్ కుమార్ నిషాద్, బీజే కుమార్ నిషాద్ ఇద్దరు మా బాబాయిలు. వారిద్దరూ ఈ దుర్ఘటనలో మృతిచెందారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి మృతి చెందడంతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
– పవన్ నిషాద్ (మృతులు అఖిలేష్ కుమార్ నిషాద్, బీజే కుమార్ నిషాద్ సోదరుడి కొడుకు)