హుస్నాబాద్, ఆగస్టు 14: వానకాలం సీజన్లో కూరగాయల మార్కెట్, ప్రధాన కూడళ్లలో బుట్టలు, తట్టల్లో ఎక్కువగా దర్శనమిస్తాయి బోడ కాకరకాయలు. ఇవి వానకాలం సీజన్లోని జూలై, ఆగస్టుతోపాటు సెప్టెంబర్ ప్రథమార్థంలో మాత్రమే మార్కెట్లో లభిస్తాయి. దీనిని అడవి కాకర అని కూడా అం టారు. దీని రుచి ఒకసారి చూశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించే విధంగా ఉంటుంది.
అటవీప్రాంతంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా పండే ఈ కూరగాయను ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. వానకాలం ప్రారంభంలో కిలో రూ.400లకు పైగా ధర పలికిన ఈ బోడ కాకరకాయ ప్రస్తుతం కాత ఎక్కువగా వస్తుండటంతో రూ.200 వరకు మార్కెట్లో అమ్ముతున్నారు. అటవీజాతి పంట గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, రైతులకు మంచి ఉపాధి ఇస్తున్నది.