సిద్దిపేట, జూలై 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర బడ్జెట్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలను ఎంతగానో నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్‌పై ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ప్రాజెక్టుల ఊసే లేదు. రహదారుల విస్తరణ నిధుల కేటాయించలేదు. రైతులకు ఎలాంటి భరోసానివ్వలేదు. యువతకు ఉపాధి అవకాశాలను చూపలేదు. ‘రైతుభరోసా’ ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వలేదు. చేయూత పథకానికి మోక్షం ఎప్పుడో తెలియదు.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సబ్బండ వర్గాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కేవలం రీజినల్ రింగు రోడ్డు భూసేకరణకు నిధులను కేటాయించింది.
దీంతో పాటు మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రో విస్తరిస్తామని బడ్జెట్లో స్పష్టం చేసింది. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ఉన్నప్పటికీ పైసా నిధులు కేటాయించలేక పోయారని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంకెల గారడి తప్ప ఏ ఒక్క వర్గానికి ప్రయోజనం చేకూరేలా లేదని మేధావులు, రైతు సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. అధికారంలోకి రావడానికి ఎన్నికలప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి అమలుకు కావాల్సిన నిధులు బడ్జెల్లో కేటాయించ లేదు. రైతుభరోసాపై దాటవేత ధోరణి అవలంభించడం రైతులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రెండు పంటలకు రైతుబంధు కింద సాయం అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నీరుగార్చింది. ఈసారి వానకాలం సాగుకు రైతుభరోసా ఇవ్వకుండా చెయ్యిచ్చింది. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు చాలామంది రైతులు ముందుకు వచ్చారు. వారికి ప్రోత్సహకాహాలు, భరోసా ఇవ్వలేదు.జిల్లాలో చేపట్టిన వివిధ పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని, యువతకు భృతి హామీ ఇచ్చింది. వాటి గురించి ప్రస్తావించలేదు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ఆదుకోవడానికి ఎలాం టి ప్రకటన చేయకపోవడం, నిధులు కేటాయించక పోవడంతో ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన కాల్వలు పూర్తికి నిధులు కేటాయించలేదు. సిద్దిపేట జిల్లాలో రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, తపాస్‌పల్లి రిజర్వాయర్ల నిర్వహణ, అభివృద్ధి పనులకు నిధులను కేటాయించలేదు. రంగనాయకసాగర్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన టూరిజం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. మెదక్ జిల్లాలో వనదుర్గా ఘనపుర ప్రాజెక్టుకు నిధుల ఊసే లేదు. సింగూరు ప్రాజెక్టు ఆధునీకరణ , కాల్వల లైనింగ్ పనులకు నిధులను కేటాయించలేదు. కాల్వల్లో పేరుకపోయిన పిచ్చిచెట్లు, పూడికను తీయలేని పరిస్థతిలో ఈ ప్రభుత్వం ఉంది. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది ఇప్పటికే చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి.
ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కాళేశ్వరం నీటిపైనే రైతులు ఆధారపడి ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.4,500 కోట్లు కేటాయించి పనులకు శంకుస్థాపన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. ఈ ప్రాజెక్టులను రద్దు చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. గౌరవెల్లి రిజర్వాయర్‌ను రన్ చేస్తామని చెప్పలేదు. ఇక జిల్లాలోని కొన్ని ప్రాజెక్టుల కింద కాల్వల్లో పూడిక పేరుకు పోయింది. ప్రాజెక్టుల నిర్వాహణను ఈ ప్రభుత్వం గాలికి వదిలివేసింది. ఫలితంగా రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలాలేవు. సంగారెడ్డి జిల్లాలో నల్లవాగు, నారింజ వాగు, మెదక్, సిద్దిపేట జిల్లాలోని హల్దీవాగు వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ మున్సిపాలిటీ, జూలై 25: బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు.. మెదక్ ప్రజలకు గుండు సున్నా నిధులు కేటాయించారని నిరసిస్తూ మెదక్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం మర్చిపోయారన్నారు.
ఏడుపాయల వనదుర్గా దేవస్థానాన్ని, మెదక్ ఖిల్లాను అభివృద్ధి చేస్తానని, పోచారం పర్యటక కేంద్రం గా తీర్చిదిద్దుతానన్న మాటలు ఏమయ్యాయని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. మెదక్ జిల్లాపై సీఎంకు చిన్నచూపు తగదన్నారు. మెదక్ పట్టణానికి రింగురోడ్డుకు నిధులు, మంజీరా ఎత్తిపోతలకు, కొంటూరు చెరువు, గుండు వాగుకు నిధులు ఏమిచ్చారాన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ఎమ్ఎల్ఎన్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, నాయకులు రంజిత్‌రెడ్డి, ఆకుల రాము, సత్యనారాయణ, ప్రభాకర్, శ్రీనివాస్, చంద్రశేకర్, చైతన్య కుమార్, శివ, వంశీ, రాహు ల్, విఠల్, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కింద చేపట్టిన కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వాటి గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో సర్కారు విద్య నీరుగారిపోతున్నది. జిల్లాలో విరివిగా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ చెప్పింది. దానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఉపాధి అవకాశలపై ఆశలు పెట్టుకున్న యువత నిరాశ చెందుతున్నది.
జహీరాబాద్‌లోని జాతీయ ఉత్పాదక మండలి (నిమ్జ్)ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతటి కీలకమైన ప్రాజెక్టు భూసేకరణలో పురోగతి లేదు. ఎలాంటి నిధులు కేటాయించలేదు. గ్రామ పంచాయతీలకు నిధులు రాక నీరసించాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల రూపంలో తప్పా జిల్లాకు ప్రత్యేక కేటాయింపుల ఈ బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు చేయపోవడంతో అందరి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంగారెడ్డి, జూలై 25: బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గురువారం సంగారెడ్డిలోని పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ప్రధాన రోడ్డుపై ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి మా ట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసేలేదని, సంక్షేమ పథకాల అమలు ఎక్కడా కనిపించలేదని ఎద్దేవా చేశారు.
పార్లమెంటులో మెదక్ ఎంపీ రఘనందన్‌రావు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను పటాన్చెరు నుంచి సంగారెడ్డికి, సంగారెడ్డి మీదుగా జోగిపేట, మెదక్, సిద్దిపేట, కరీంనగర్ వరకు పొడిగించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పటాన్చెరు వరకు మెట్రో రైలు అని ప్రవేశపెట్టడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, ప్రతాప్‌రెడ్డి, మాణిక్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజుగౌడ్, భాస్కర్ యాదవ్, శ్రీనివాస గుప్తా, మందుల నాగరాజు, రాజు, ప్రవీణ్ యాదవ్, మీనాగౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేట, జూలై 25: బడ్జెట్లో విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. విద్యారంగానికి కేవలం 7.3శాతం నిధులు మాత్రమే కేటాయించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు తగ్గించి విద్యార్థులను మోసం చేస్తుంది. ఈ నిధులతో విద్యారంగ అభివృద్ధి ఏ మాత్రం సాధ్యం కాదు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ సూల్ ఏర్పాటు చేస్తామన్న ఊసే బడ్జెట్లో లేదు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు కేటాయించ లేదు. ప్రతి నియోజకవర్గానికీ డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీపై కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు.
-దాసరి ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి, సిద్దిపేట జిల్లా
నర్సాపూర్, జూలై 25: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలను విస్మరించారు. ఈ బడ్జెట్ కేవలం ఊహాగానమే తప్ప, ఎక్కడా ఆచరించే విధానం కనపడటం లేదు. నిధులు కేటాయించినట్లే ఉంది. కానీ, ఉపయోగించే పరిస్థితి లేదు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో అన్నీ అబద్ధాలే ప్రస్తావించింది. రైతుభరోసా ఇచ్చినట్లు, రుణమాఫీ చేసినట్లు అబద్ధాలు పలికారు. రూ.6 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి, మొత్తం మాఫీ చేసినట్లు సభలో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. రైతుభరోసా రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొని బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించ లేదు. మహిళలకు నెలకు ఇస్తానన్న రూ.2,500 భృతికి సంబంధించిన ప్రస్తావన బడ్జెట్లో తీసుకురాకుండా మహిళలను మోసం చేశారు. ఇది అంకెల గారడీ తప్ప, కొత్త పథకాల ఊసే లేదు.
– సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్
నర్సాపూర్, జూలై 25: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుభరోసా ఊసే లేకపోవడం దారుణం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి కింద రైతులకు రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని హామీనిచ్చారు. ఈ డబ్బులను పంట రుణమాఫీకి మళ్లించారనేది నేటితో రుజువైంది. అధికారంలోకి రాగానే రైతుభరోసాకు చరమగీతం పాడారు. కనీసం బడ్జెట్లోనైన రైతు భరోసాకు నిధులు కేటాయిస్తారని రైతులు భావిస్తే వారి ఆశలను అడిఆశాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పంటలకు రైతుబంధు అందిస్తే కాంగ్రెస్ ఒక్క పంటకు కూడా రైతుభరోసా ఇవ్వకపోవడం దురదృష్టకరం. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది.
– గడ్డం రాకేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్, గోమారం
నర్సాపూర్, జూలై 25: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతుభరోసా ఊసే లేకపోవడం దారుణం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంట పెట్టుబడి కింద రైతులకు రూ.15 వేలు రైతుభరోసా ఇస్తామని హామీనిచ్చారు. ఈ డబ్బులను పంట రుణమాఫీకి మళ్లించారనేది నేటితో రుజువైంది. అధికారంలోకి రాగానే రైతుభరోసాకు చరమగీతం పాడారు. కనీసం బడ్జెట్లోనైన రైతు భరోసాకు నిధులు కేటాయిస్తారని రైతులు భావిస్తే వారి ఆశలను అడిఆశాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పంటలకు రైతుబంధు అందిస్తే కాంగ్రెస్ ఒక్క పంటకు కూడా రైతుభరోసా ఇవ్వకపోవడం దురదృష్టకరం. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుంది.
– గడ్డం రాకేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్, గోమారం అంబేద్కర్ అభయహస్తానికి మొండిచేయి
పటాన్చెరు, జూలై 25: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల సంక్షేమాన్ని మరిచారు. కేం ద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి వరకు మెట్రో రైలు విషయంపై బడ్జెట్లో ప్రస్తావించలేదు. ప్రభు త్వం గొర్రెల పంపిణీని, ఉచిత చేపపిల్లల పథకాన్ని విస్మరించింది. దళితులకు దళితబంధు ఇవ్వకుండా ఆపేసింది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు, కార్మికులకు 34శాతం పీఆర్సీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సీ ప్రస్తావనే చేయలేదు. ఉద్యోగులకు, రైతులకు బడ్జెట్లో అన్యాయం చేశారు. మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు.
– మెట్టు కుమార్‌యాదవ్, పటాన్చెరు కార్పొరేటర్
మిరుదొడ్డి, జూలై 25: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితజాతికి తీరని అన్యాయం జరిగింది. రాష్ట్రంలోని దళితులకు రూ.52,409 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.33,124 వేలు కోట్లను మత్రమే కేటాయించింది. ప్రభుత్వం అణగారిన కులాలకు అధికంగా నిధులు కేంటాయించి ఆర్థికంగా ఆదుకోవాలి, లేదంటే దళితజాతి ఆగ్రహానికి లోనుకాక తప్పదు. గొప్పలు చెప్పడం మాని ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రకారం మొత్తం రాష్ట్ర బడ్జెట్లో రూ.2,91, 159 కోట్లు కేటాయించాలి. అంబేద్కర్ అభయహస్తం పథకం గూరించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించకపోవడం శోచనీయం. మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి.
– శంకర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి (డీబీఎఫ్), మిరుదొడ్డి
హుస్నాబాద్ టౌన్, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొత్తదనం ఏమిలేదు. ఆర్థికంగా లోటుఉందనే చెప్పడానికే ప్రయత్నం చేశారు తప్ప కొత్త పనులు చేపడుతామని చెప్పలేదు. ఉద్యోగులకు ఫస్ట్ తారీకు జీతాలు ఇస్తున్నామని చెప్పుతున్న సర్కారు, నాలుగు డీఏలు ఎందుకు ఇవ్వలేకపోయిందనే విషయాన్ని విస్మరించింది. గొప్పగా చెప్పడానికి బడ్జెట్లో ఏమి కనపడుత లేదు. అన్ని రంగాలను విస్మరించింది. అన్ని వర్గాలకూ అన్యాయం చేసింది.
– పందిల్ల శంకర్, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, హుస్నాబాద్
చేర్యాల, జూలై 25 : తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 21,292(7.31శాతం)కోట్ల నిధులు కేటాయించడం సిగ్గుచేటు. విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించినా సర్కారు పట్టించుకోలేదు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయింపులు ఎలా సరిపోతాయో ప్రభుత్వానికే తెలియాలి. కాంగ్రెస్ సర్కారు ఇదే పద్ధతి కొనసాగిస్తే ఎక్కడిక్కడ కాంగ్రెస్ నాయకులను విద్యార్థులు నిలదీస్తారు. బడ్జెట్ కేటాయింపులపై సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి.
– వేణు, ఏఐఎస్బీ రాష్ట్ర కార్యదర్శి
వర్గల్, జూలై 25: కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్టీ, ఎస్సీ, బీసీల సంక్షేమం కోసం ఏమి చేయనున్నారో చెప్పలేదు. ఎన్నికల హామీలో ఆయా వర్గాలకు ఇచ్చిన కనీస ప్రయోజనాలైన కార్పొరేషన్ ఫండ్ ప్రస్తావన కూడా చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధు, బీసీబంధును అమలు చేయడమే కాకుండా వివిధ కార్పొరేషన్ల కింద లోన్లు ఇచ్చి చేయూతనిచ్చింది. కాంగ్రెస్ ప్రభు త్వం అణగారిన వర్గాలు, వెనకబడిన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీలకు బడ్జెట్లో మొండిచేయి ఇచ్చింది. ముమ్మాటికీ ఆయా వర్గాలను ప్రభుత్వం మోసం చేసింది.
– పడిగె రాజు, బీసీ సంఘం నేత, వర్గల్ మండల
వర్గల్, జూలై 25 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకూ అన్యాయం జరిగింది. చేనేత, మత్స్య, స్వర్ణ, చేతివృత్తులు తదితర ప్రజలకు చేయూతనిస్తున్నట్లు బడ్జెట్ రూపకల్పన చేయలేకపోయారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పాడి, మత్స్య, రైతు, రైతు అనుబంధ సంస్థలకు నేరుగా ప్రయోజనం కల్గిస్తే, ఈ ప్రభుత్వం వాటి ప్రస్తావనే తీయలేదు. రైతుభరోసా మటే మరిచారు. రుణమాఫీలో కూడా అనేక కొర్రీలు పెడుతూ చప్పట్లు కొట్టించుకున్నారు. ఏ ఊర్లో కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు పంట రుణ మాఫీలు కాలేదు. చేతివృత్తులు, నేతన్నలు, రైతన్నలు మళ్లా తిరుగబడే సమయం ఆసన్నమైంది.
– దేవగణిక నాగరాజు, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా
కోహీర్, జూలై 25: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకున్నామని అసెంబ్లీ సాక్షిగా చాలా పెద్ద మాట చెప్పారు. మరి రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉన్నారు. ఏ విధంగా వారిని కోటీశ్వరులగా చేస్తారో చెబితే బాగుండేది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. ఇంతవరకు ఎంత మందిని కోటీశ్వరులను చేశారు. అది కూడా చెబితే బాగుండేది.
-శాంతమ్మ, మాజీ జడ్పీటీసీ, కోహీర్
కోహీర్, జూలై 25: ఎన్నికల సందర్భంగా మహిళలకు నెలనెలా రూ.2.500 ఇస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.4వేలు ఇస్తామని హామీనిచ్చారు. రైతు భరోసా ఎకరానికి రూ.15వేలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. కల్యాణలక్ష్మి పథకం లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామన్నారు. మరి వాటిని ఎప్పటి నుంచి ఇస్తారో బడ్జెట్ ప్రసంగంలో చెబితే అందరూ సంతోషపడేటోళ్లు. కానీ ఇవన్నీ మర్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
-నామ రవికిరణ్ గుప్తా, మాజీ కౌన్సిలర్, జహీరాబాద్
నారాయణఖేడ్, జూలై 25: ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను పరిశీలిస్తే సంక్షేమం, అభివృద్ధి మధ్య సమన్వయం లేదు. కేసీఆర్ ప్రభుత్వం అణగారిన ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించి, ఆయా వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదు. ఈ బడ్జెట్ ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పర్చే రీతిలో లేదు. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా ఉంది.
– భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నారాయణఖేడ్