సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 8: జిల్లాలో తొలిసారి బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిందని, బర్డ్‌ఫ్లూ ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు.
తొగుట మండలం కాన్గల్‌లోని ఓ లేయ ర్ కోళ్ల ఫామ్‌లో కోళ్లకు హెచ్5 ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ (బర్డ్ ఫ్లూ) నిర్ధ్దారణ కావడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి వ్యాధి విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడ్చివేయాలన్నారు.
కోళ్లఫామ్‌లో పనిచేసే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కిలోమీటర్ లోపు కోళ్లను గానీ, కోడిగుడ్లు గానీ అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లఫామ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు రాకపోకలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 8500404016 కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. 74 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కోడి మాంసాన్ని, గుడ్లను ఉడికిస్తే వైరస్ బతకదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా 70 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు పైగా ఉడికించి తినవచ్చన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ అశోక్‌కుమార్, డీఎంహెచ్‌వో అధికారి పల్వన్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.