సిద్దిపేట, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు, ఆకలితో విద్యార్థులు అలమటించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకం నీరుగారుతున్నది.భోజనం వండిపెడుతున్న కార్మికులకు నాలుగు నెలల నుంచి బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బయట అప్పులు తెచ్చి మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారు. నాలుగు నెలలుగా పెండింగ్‌లోనే బిల్లులు ఉండడంతో వచ్చే బిల్లులు వడ్డీలకే సరిపోతున్నాయని కార్మికులు వాపోతున్నారు. వంట వండడం కష్టంగా ఉందని జిల్లాలో పాఠశాలలో పనిచేస్తున్న భోజన కార్మికులు చెబుతున్నారు. బుధవారం(నేడు) సిద్దిపేట జిల్లా లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, ఎంఈవోలను, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను జి ల్లా విద్యాశాఖ అలర్ట్ చేసింది.
కమిషనర్ పర్యటన నేపథ్యంలో ప్రతి పాఠశాలను శుభ్రంగా ఉంచాలని, ఆ రోజు ఉన్న మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం రుచి గా, శుచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కిచెన్‌షెడ్ పరిసరాలు, చుట్టుపక్కల వా తావరణం బాగుండేలా చూసుకోవాలని ఆదేశించారు. దీనిని బట్టి చూస్తే మిగతా రోజుల్లో మెనూ అమలు కావడం లేదని తెలుస్తున్నది. నాణ్యమైన భోజనం పెట్టడం లేదా ..? అనే సందేహాలు కలుగుతున్నాయి.
మార్కెట్లో పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలు అందరికీ చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల నూనెల ధరలు బాగా పెరిగాయి. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో మధ్యాహ్న భోజనం వండడం కష్టం గా మారిందని భోజన కార్మికులు వాపోతున్నారు. పెరిగిన ధరలతో సరుకులు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. నాలుగు నెలలుగా కోడిగుడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజన అమలు లక్ష్యం నీరుగారుతున్నది. ఉన్న సరుకులతో పిల్లలకు వండిపెడుతున్నామని, బయట వడ్డీలకు ఎంతగానం డబ్బులు తెస్తామంటూ కార్మికులు చెబుతున్నారు.
ప్రతినెలా సరిగ్గా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు కమీషన్ పెంచాలని కార్మికులు కోరుతున్నారు. ఒకవైపు బిల్లులు అందక ఇక్కట్లు పడుతుంటే…మరోవైపు మెనూ సరిగ్గా పాటించి నాణ్యమైన భోజనం పెట్టాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ఇదే సమయంలో పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కార్మికులు కూడా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టడానికి అవకాశం ఉంటుంది.ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మొ త్తం 921 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా యి.
వీటిలో 73,246 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్య ను చూసుకుంటే 69 వేల మంది ఉంటారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ పిల్లలకు వంట వండడానికి జిల్లాలో మొత్తం 1982 మంది మధ్యాహ్నభోజన కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతినెలా రూ. 60 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో విద్మార్థికి ప్రభుత్వం 1వ తరగతి నుంచి 5వ వరకు రూ. 10.45 డబ్బులు చెల్లిస్తున్నది. 6వ తరగతి నుంచి 8వ వరకు రూ. 13.17 చెల్లిస్తున్నది. 9వ, 10వ తరగతుల విద్యార్థులకు రూ. 10.67 చొప్పు న చెల్లిస్తున్నది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు కోడిగుడ్డు చార్జీల విషయంలో వేర్వేరుగా చెల్లిస్తున్నారు. కోడిగుడ్ల చార్జీలు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ట్లు మధ్యాహ్న భోజన కార్మికులు చెబుతున్నారు. నూనె లేనిది వంట పూర్తికాదు. ప్రస్తుతం ఒక్కో రకం లీటర్ నూనె ప్యాకెట్ చేసుకుంటే సన్‌ప్లవర్ నూనె ధర రూ 200, పామాయిల్ రూ 160, వేరుశనగ రూ. 190 ధరలు మార్కెట్లో ఉన్నాయి.