జహీరాబాద్, జనవరి 1: రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడెకన్నె గ్రామం భూసమస్యలు లేని పల్లెగా గుర్తింపు పొందంది. ఈ గ్రామంలో ప్రభుత్వ , ఫారెస్టు శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి, పేద రైతులకు పట్టా పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. పదిహేనేళ్ల సమస్య పరిష్కారం కావడంతో గ్రామ రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మంత్రి హరీశ్‌రావు కృషితో పరిష్కారం..
బిడెకన్నె గ్రామాన్ని భూ సమస్యలు లేని పల్లెగా ప్రకటించక ముందు ప్రభుత్వానికి 344 మంది రైతులు పట్టా పాసుపుస్తకాల కోసం దరఖాస్తు చేశారు. ఈ రైతులకు సంబంధించి భూ విస్తీర్ణం 552.35 ఎకరాలు ఉంది. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ శరత్ కృషితో 146 మంది రైతులకు చెందిన 264.20 ఎకరాల భూమి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు చేసి, పట్టా పాసుపుస్తకాలు అందజేశారు. మరో 198 దరఖాస్తులు పరిష్కరిస్తున్నారు. వాటికి సంబంధించి భూమి 288.15 ఎకరాలు ఉంది. గ్రామంలో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రం ద్వారా ప్రతి రైతు భూ వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. కొత్తగా మరో 123 మంది రైతులకు 291.05 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలో అర్హులైన పేదలను గుర్తించి 307 ఎకరాలు, 145మంది రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
ధరణితో భూ సమస్యలు పరిష్కరించడంతో సంతోషంగా ఉన్నదని బిడెకన్నె గ్రామ రైతులు తెలిపారు. తమ భూ సమస్యలు పరిష్కారం కావని, రైతు బంధు, రైతు బీమా రాదని అనుకున్నామని, మంత్రి హరీశ్‌రావు దేవుడిలా వచ్చి తమ సమస్య పరిష్కరించారని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ, ఫారెస్టు భూముల సరిహద్దుల సమస్య అనే ఏండ్లుగా నానుతున్నదని, ఫారెస్టు అధికారులు ఈ భూమి తమ పరిధిలో ఉందని ఫిర్యాదు చేయడంతో ధరణిలో భూముల వివరాలు నమోదు కాలేదు. దీంతో రైతులు పంటలు సాగు చేసుకుంటున్నా పట్టా పాసుపుస్తకాలు రాలేదు. సాగు చేస్తున్న రైతులకు రైతుబంధు, రైతు బీమా రాలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
బిడెకన్నె గ్రామ భౌగోళిక విస్తీర్ణం 3097.08 ఎకరాలు
వ్యవసాయ భూమి 2595.22 ఎకరాలు
వ్యవసాయేతర భూమి(అటవీ భూమి) 501.26 ఎకరాలు
పట్టాభూమి 1735.23 ఎకరాలు
పట్టాదారులు 523 రైతుబంధు పొందుతున్న వారు
ప్రభుత్వ భూమి (లావుణి పట్టాదార్లు) 310 రైతులు
గ్రామంలో ప్రభుత్వ భూమి విస్తీర్ణం 552.35 ఎకరాలు
శివాయ జమాబందీ (మిగిలిన ప్రభుత్వ భూమి)
శివాయ జమాబందీదారుల సంఖ్య 178రైతులు
భూమి విస్తీర్ణం 307.04
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పరిష్కారం
మా గ్రామంలో పదేండ్లుగా భూ సమస్య ఉంది. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నా పట్టా పాస్తుపుస్తకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. భూముల వివరాలు ధరణిలో నమోదు చేసి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ దృష్టికి తీసుకెళ్లాం. వారు మంత్రి హరీశ్‌రావుకు తెలిపి కొత్తగా పట్టా పాసుపుస్తకాలు ఇప్పించారు. సంతోషంగా ఉంది.
– దత్తు పాటిల్, రైతు, బిడెకన్నె
రైతుబంధు, రైతుబీమా రాలేదు..
ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి లో కొన్నేండ్లుగా పంటలు పడిస్తు న్నాం. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు ఉండేవి. ధరణి రావడంతో ఫారెస్టు అధికారులు కొత్త పుస్తకాలు రాకుండా అడ్డుకున్నారు. కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని పలుమార్లు సంగారెడ్డి కలెక్టరేట్, ఝరాసంగంలో తహసీల్ ఆఫీసులో దరఖాస్తు చేశాం. ఎవరూ స్పందించలేదు. రైతులందరం వెళ్లి సమస్య వివరించాం.
– బోయిని జగన్, రైతు, బిడెకన్నె
పాసుబుక్కులు రావడం సంతోషంగా ఉంది
మా భూములను ధరిణిలో నమో దు చేసి కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని పలు మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. మా భూములు ఫారె స్టు అధికారులు తీసుకుంటారని ఆందోళన చెందాం. దేవుడిలా మంత్రి హరీశ్‌రావు సారు మాకు సహాయం చేసి కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. సర్కార్‌కు ఎప్పడు రుణపడి ఉంటాం.
– బ్యాగరి తుల్లజమ్మ, మహిళా రైతు, బిడెకన్నె