నర్సాపూర్, సెప్టెంబర్ 21: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారంచుట్టారు. గత పాలకుల హయాంలో తాగు నీటికి ఆడబిడ్డలు పడ్డ కష్టాలు వర్ణణాతీతం. గుక్కెడు నీటి కోసం బిందెలు పట్టుకుని కిలోమీటర్ల దూరమున్న పొలాల వద్దకు, బోరు బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో చూశాం. గతంలో వీధికి ఒక నల్లా ఏర్పాటు చేయడంతో బిందెలు పట్టుకుని మహిళలు నిత్యం గొడవలు పడేవారు. నేడు సీఎం కేసీఆర్ సంకల్పంతో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ లాంటి మహత్తరమైన కార్యక్రమానికి పురుడు పోశా రు. ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చారు. తాగునీరు అందడంతోపాటు ఫ్లోరైడ్ సమస్య కూడా పూర్తిగా సమసిపోయింది. ఉదయం లేవగానే ఇంటి ముంగిట్లోనే నల్లాల ద్వారా మంచి నీరు రావడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లను తాగడానికే కాకుండా ఇతర అవసరాలకూ వాడుకుంటున్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీతోపాటు ప్రతి గ్రామానికి, మారుమూల తండాలకు సైతం నేడు మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, వెల్దుర్తి, హత్నూరా, చిలిపిచెడ్, శివంపేట్, మాసాయిపేట్ మండలాల్లోని గ్రామాలు, గిరిజన తండాల్లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు నిర్మించి, ఇంటింటికి పైపులైన్ వేసి నల్లాలు బిగించి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 351 వాటర్ ట్యాంకులు కొత్తగా నిర్మించారు. 1045 కిలోమీటర్ల పైపులైన్ ఏర్పాటు చేసి 74,203 నల్లాలు బిగిం చి, మిషన్ భగీరథ నీళ్లను అందిస్తున్నారు.
నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంలో 65 వాటర్ ట్యాం కులు, 166 కిలోమీటర్ల పైపులైన్, 11,880 నల్లాలు, కౌడిపల్లి మండలంలో 52 వాటర్ ట్యాంకులు, 158 కిలోమీటర్ల పైపులైన్, 9,362 నల్లాలు, కొల్చారం మండలంలో 36 ట్యాంకులు, 139 కిలోమీటర్ల పైపులైన్, 9,552 నల్లాలను, చిలిపిచెడ్ మండలంలో 38 ట్యాంకులు, 86 కిలోమీటర్ల పైపులైన్, 6049 నల్లాలు, వెల్దుర్తి, మాసాయిపేట్ మండలాల్లో 34 ట్యాంకులు, 123 కిలో మీటర్ల పైపులైన్, 10134 నల్లాలు, శివంపేట్ మండలంలో 73 ట్యాంకులు, 163 కిలో మీటర్ల పైపులైన్, 11,491 నల్లాలు, హత్నూరా మండలంలో 53 ట్యాంకులు, 210 కిలోమీటర్ల పైపులైన్, 15,735 నల్లాలు ఏర్పాటు చేసి, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది.
గతంలో నీళ్ల కోసం ఎన్నో తిప్పలు పడ్డాం. సరిగ్గా నీళ్లు రాక పొలాల్లోని బోరు మోటర్ల కాడికి పోయి నీళ్లు తెచ్చుకునేటోళ్లం. వారాల పొడ్తా పడుకుంటా, లేసుకుంటా పోయి బిందెలతో నీళ్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ పుణ్యానా ఇంటికే నల్లా నీళ్లు వస్తున్నాయి. పొద్దున లేవంగనే ఇంటి ముందు నీళ్లు వస్తుంటే మస్తు సంతోషమైతున్నది. తాగడానికే కాకుండా వంట కు, స్నానాలకు అన్ని పనులకు నీళ్లు సరిపోతున్నాయి. నీటి కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటం. – నీరుడి నర్సమ్మ, నర్సాపూర్
మిషన్ భగీరథ అనేది బృహత్తరమైన కార్యక్రమం. మహిళలు నీళ్ల కోసం ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో గ్రామాలకు వెళ్తే ఖాళీ బిందెలతో మహిళలు నిరసన చేసేవారు. నేడు పరిస్థితి మారిపోయింది, ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీరు అందుతున్నది. మహిళలు చాలా సంతోషిస్తున్నరు. ఇది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యపడింది. సీఎం కేసీఆర్‌కు మహిళలు ఎల్లప్పుడు అండగా ఉంటారు.
– మదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్