మెదక్ మున్సిపాలిటీ, జూన్ 6 : ఈ 2025-26 విద్యాసంవత్సరానికి గానూ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు బెస్ట్ అవైలెబుల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిణి నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ అవైలెబుల్ పాఠశాలల్లో జిల్లాలో మొత్తం 49 సీట్లు ఖాళీలు ఉండగా.. అందులో 3వ తరగతిలో 25 సీట్లు, 5వ తరగతిలో 12 సీట్లు, 8వ తరగతిలో 12 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మెదక్ జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థినీవిద్యార్థులు ఈ నెల 17వ తేదిలోగా దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్లోని జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. బాలికలకు 33 శాతం సీట్లు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించబడుతుందని తెలిపారు. 20వ తేది ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్దతిన విద్యార్థుల ఎంపిక నిర్వహించబడుతుందని అన్నారు. పూర్తి వివరాలకు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.