సిద్దిపేట, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో సమగ్ర కుల గణన పూర్తి చేయకుండానే పూర్తి చేశామని అధికార కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకుంటుందని బీసీ సంఘాల నేతలు, బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేశామని చెప్పుకుంటున్న ఇంటింటి సమగ్ర సర్వేపై మండి పడుతున్నాయి. సర్వేలో మీరు అడిగింది ఏంటి ..? చేసింది.. ఏంటి …? ఎక్కడ సర్వే పూర్తి చేశారంటూ ప్రభుత్వంపై బీసీ సంఘాలు, నాయకులు, ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా 50శాతం సర్వే పూర్తి కాలేదని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నిజంగా జిల్లాల వారీగా పూర్తి సమగ్ర కుల గణన పూర్తయితే, ఎందుకు జాబితాను పూర్తిస్థాయిలో విడుదల చేయడం లేదని ఆ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. యాభై శాతం వరకు సర్వే పూర్తి చేసి, దానిని వందశాతం పూర్తి అయిందని అనడం ఎంతవరకు సబబు అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. వివిధ రంగాల్లో ఉన్నవారి స్థితిగతులు అంచనా వేయడానికి దోహదపడాలి కానీ, ప్రభుత్వం చేసిన సర్వే అప్పులు, ఆస్తులు ఇతర అంశాలు అడిగారని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సామన్య ప్రజల ఆస్తులు అడిగారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. బీసీ వర్గాలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని మండిపడుతున్నారు.
సమగ్ర కుల గణన సర్వే పూర్తిస్థాయిలో చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ వర్గాలకు 42శాతం కోటా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అడ్డదారులు తొక్కుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర కుల గణన పూర్తిస్థాయిలో చేయాలని ఆ వర్గాలు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
గజ్వేల్, ఫిబ్రవరి 3: న్యాయపరంగా అమలు చేయాల్సిన రిజర్వేషన్లను ప్రభుత్వం బీసీలకు వెంటనే అమలు చేయాలి. 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. సబ్ కమిటీ ప్రకటించిన కుల గణన నివేదిక తప్పులతడక. వందశాతం కుల గణన చేశామనడం తప్పు. ఏ గ్రామంలో పూర్తిస్థాయిలో సర్వే చేపట్ట లేదు. కుల గణన సర్వేలో అన్ని రకాల వివరాలు అడగడంతో చాలామంది సర్వేకు ముందుకు రాలేదు. వందశాతం సర్వే పూర్తి కాకుండానే వివరాలు ప్రకటించారు. ప్రభుత్వం మరోసారి సమయం తీసుకొని సర్వేలో పాల్గొనని వారి వివరాలు తీసుకునేలా సర్వే చేపట్టాలి. అప్పుడే బీసీ కులాల శాతం ఎంత ఉందో బయటపడుతుంది. తప్పుల వివరాలను బహిర్గతం చేయడంతో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది.
– మాదాసు శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్, గజ్వేల్
గుమ్మడిదల, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో గతేడాది నవంబర్లో ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి ఇప్పుడు బీసీలు 46శాతమే అని తెల్చడం సరైనది కాదు. ఇందులో ముస్లిం బీసీలు కలిపితే 56శాతమని, ఇంకా 16 లక్షల మంది వివరాలు సేకరించలేకపోయామని చెప్పడం వల్ల బీసీలకు అన్యాయం జరిగినట్లే. వందశాతం కులగణన చేసినప్పుడే గణన జరిగినట్లు. ఈ కులగణనతోనే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ వస్తుంది. ఈ తప్పుడు లెక్కల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎంతో గొప్పగా కులగణన చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనలో విఫలమైనది. పూర్తిస్థాయిలో బీసీ కులగణన చేయాలి. రాష్ట్రంలో 60శాతం బీసీలు ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలి.
– మంగయ్య, బీసీ నాయకుడు, దోమడుగు, గుమ్మడిదల మండలం
గుమ్మడిదల, ఫిబ్రవరి 3: బీసీ కుల గణన చేస్తామని గొప్పలు చేప్పిన రేవంత్రెడ్డి సర్కారు, ఇప్పుడు బీసీ కులగణన పూర్తిస్థాయిలో చేయకపోవడం విడ్డూరంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ ఒక్కరోజులో జనాభ గణన చేసి రికార్డు సృష్టించింది. ఆ ఘనత అప్పటి సీఎం కేసీఆర్ సర్కారుకే దక్కింది. కానీ కాంగ్రెస్ సర్కారు నవంబర్లో ప్రజాపాలన పేరుతో బీసీ కులగణన చేపట్టి మూడు నెలల అయినప్పటికీ పూర్తిస్థాయిలో బీసీ కులగణన చేయకపోవడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనం. గొప్పలు చెప్పడం కాదు.. చెప్పినది చేయాలనే లక్ష్యం కాంగ్రెస్ సర్కారుకు లేదని బీసీ కులస్తులు ఆరోపిస్తున్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా పూర్తి స్థాయిలో కులగణన చేయాలి.
– మురళి, అన్నారం, మాజీ సర్పంచ్, గుమ్మడిదల మున్సిపాలిటీ