ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు సాగిన బతుకమ్మ వేడుకలు గురువారం ముగిశాయి. పూలసింగిడి నేలకు దిగిందా అనే విధంగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మురిసిపోయాయి. సాయంత్రం వేళ గ్రామాల్లోని చావిడిలన్నీ బంగారు వర్ణాన్ని సంతరించుకున్నాయి. సిద్దిపేట పట్టణంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు కుటుంబసమేతంగా పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సతీమణి శ్రీనిత క్యాంప్ కార్యాలయంలో, 4వ వార్డు హనుమాన్ టెంపుల్ వద్ద, శివాజీ నగర్‌తోపాటు పట్టణంలో పలుచోట్ల్ల పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను సెలక్టు చేసి వారికి చీరలు అందజేశారు. అనంతరం కోమటి చెరువు వద్ద మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, కౌన్సిలర్ కొండం కవితాసంపత్ రెడ్డిలతో కలిసి బతుకమ్మ ఆడారు. పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ అని, ప్రపంచంలో ఒక్క తెలంగాణకే సొంతం అన్నారు. సిద్దిపేట కోమటిచెరువు వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అత్యంత గొప్పగా జరుపుకొనే పండుగ బతుకమ్మ అని, బతుకమ్మ పండుగతో దేశ, విదేశాల్లో తెలంగాణ ఖ్యాతి పెంపొందిందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతిఒకరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కోరారు. కేసీఆర్ బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించారన్నారు. గతంలో బతుకమ్మ పండుగకు కేసీఆర్ ఆడబిడ్డలకు చీరలను అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మకు రెండు చీరలతోపాటు రూ.500 ఇస్తామని చెప్పి ఎకడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మె ల్యే హరీశ్‌రావు వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, పాల సాయిరాం పాల్గొన్నారు.
-సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, అక్టోబర్ 10