పుల్కల్, సెప్టెంబర్ 8 : పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్ల ద్వారా మూడు రోజులుగా వరదను దిగువకు వదులుతున్నారు. ఆదివారం ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చారు.
అయితే ప్రాజెక్టును చూసేందుకు సందర్శకులను అనుమతించక పోవడంతో నిరాశకు గురయ్యారు.ప్రాజెక్టుకు సమీపంలోనే అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి గేటును మూసి వేశారు.దీంతో పర్యాటకులు,మహిళలు,చిన్నారులు సైతం ప్రాజెక్టు పైకి వెళ్లేందుకు దారి లేక ప్రమాదకరంగా ఉన్న కట్ట మీదకు వెళ్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వృద్ధు లు కట్ట పైకి ఎక్కారు. సింగూరు చేపలంటే రుచికి మారుపేరు. అందులో చేపల ఫ్రై అంటే పర్యాటకులు మహా ఇష్టంగా తింటారు. దీంతో చేపల ఫ్రై వద్ద సందర్శకుల తాకిడి కనిపించింది.
సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతూనే ఉన్నది. పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దాంతో అధికారులు నాలుగు రోజుల నుంచి ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
శనివారం సాయంత్రం నుంచి వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో ఒక క్రస్ట్ గేటును మూసి 6వ గేటును 1.50 మీటర్ల ఎత్తుపైకి లేపి దాని ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 2744 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, ప్రాజెక్టు దిగువభాగానికి 8142 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి వెల్లడించారు. పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో 28.6 11 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.