మెదక్ అర్బన్, మార్చి 16: వర్టికల్ పద్ధతిలో ప్రతిభ కనబర్చిన మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసులు అవార్డులు అందుకున్నట్లు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో 2022 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా 75 మంది మెరిటోరియస్, ఉత్తమ పనితీరు కనబరిచిన రిసెప్షన్ అధికారులకు గురువారం అవార్డులు అందజేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర పోలీస్ అకాడమీ, రాణి రుద్రమదేవి ఆడిటోరియంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ సత్కరించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 721 పోలీస్స్టేషన్లలో 75 మంది బెస్ట్ రిసెప్షన్ అధికారులను గుర్తించారని తెలిపారు. మెదక్ జిల్లాకు 3 ఉత్తమ పురస్కారాలు వచ్చినట్లు వివరించారు.
రేగోడ్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దల్చుకూరి యశోదకు 14వ స్థానం, మెదక్ రూరల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సింగారం రేణుకకు 23వ స్థానం, నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పల్లపు కవిత 42వ స్థానంలో అవార్డులు అందుకున్నారు. అభ్యర్థనలు, ఫిర్యాదులు, సమాచారం, సహాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సేవలు అందించడంలో వీరి పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. అభిలాష బిష్త్, మహేశ్ భగవత్, సందీప్ శాండిల్య, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ అధికారి టీవిఎస్ రావు, సర్కిల్ హెడ్ వినోద్ గుండే, జోస్ స్టీఫెన్, జోనల్ హెడ్ సత్యనారాయణరావు పాల్గొన్నారు.