సిద్దిపేట కలెక్టరేట్, అక్టోబర్ 30 : జిల్లాలోని జాతీయ, రాష్ట్ర, ఇతర అన్నిరకాల రహదారులపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు భద్రతా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో సీపీ డాక్టర్ అనురాధ, సంబంధిత శాఖల అధికారులతో డిస్ట్రిక్ట్ లెవల్ రోడ్ సేప్టీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించి రోడ్డు భద్రతపై తగు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి భద్రత జీవితానికి రక్షణ అని అన్నారు. పోలీస్ శాఖతో కలిసి ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు జిల్లాలోని జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులను కలిపే ప్రాంతాల్లో ఆయా రహదారులను పరిశీలించి స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారులపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులు డైవర్షన్ బోర్డులు తప్పక ఏర్పాటు చేయాలని సూచించారు. రాజీవ్ రహదారిపై బ్లింకింగ్ లైట్లు అన్ని పనిచేసేలా చూడాలని, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలను తొలింగించాలన్నారు.
దుద్దెడ,కుకునూర్‌పల్లి,గౌరారం, వంటి మామిడి గ్రామాల వద్ద ప్రమాదాలు జరగకుండా రెయిలింగ్ సీడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనల మేరకే రహదారుల నుంచి నిర్దేశిత దూరం పాటించి వైన్‌షాప్‌లు ఉండేలా చూడాలని ఎక్సైజ్ శాఖ అధికారులను సూచించారు. సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో ప్రయాణికులు దిగడానికి, ఎక్కడానికి బస్సులను రోడ్డు పక్కనే ఆపాలని ఆర్టీసీ అధికారులను సూచించారు. సీపీ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ.. ప్రయాణికులు,వాహనదారులు ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండడంతో రహదారి ప్రమాదాలు నివారించవచ్చన్నారు. పోలీస్‌శాఖ సూచించే నియమ నిబంధనలు డ్రైవర్లు తప్పక పాటించాలన్నారు. సమీక్షలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి, జిల్లా రవాణాశాఖ అధికారి కొండల్రావు, ఏసీపీలు మధు, పురుషోత్తం, సతీశ్, సుమన్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.