నర్సాపూర్, అక్టోబర్ 16: ఓ ఆటో డ్రైవర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బెదిరించి నగదు, పర్సు అపహరించిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం, అన్నారంకు చెందిన తుంగని కిష్టయ్య నర్సాపూర్ మండల పరిధిలోని మంతూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం నాడు ఉదయం 11 గంటల సమయంలో తన ఇంటి నుండి కొల్చారం తహసిల్దార్ కార్యాలయానికి పని నిమిత్తం రావడం జరిగింది. పని పూర్తి చేసుకొని మద్యాహ్నం 3.20 గంటలకు అన్నారం తిరిగి వెల్లడానికని కొల్చారం బస్టాండ్ వద్ద రోడ్డుపై నిలబడగా ఓ ఆటో అక్కడకు రాగా అందులో ఎక్కడం జరిగింది.
నర్సాపూర్ చౌరస్తా రాగానే అన్నారం వైపు కాకుండా… తూప్రాన్ వైపు సడన్‌గా ఆటో డ్రైవర్ ఆటోను మలిపి వేగంగా నడుపుతూ నర్సాపూర్ శివారులోని గ్యాస్ గోడౌన్ వద్ద ఎడమ వైపు గల కుంట వైపు తీసుకెళ్ళడం జరిగింది. ఆటోలోని డ్రైవర్‌తో కలిపి ముగ్గురు వ్యక్తులు చాకు చూపించి చంపుతామని బెదిరించి, కిష్టయ్యను చేతులతో కొట్టి, కాళ్ళతో తన్ని, తన వద్ద గల మోబైల్ ఫోన్, పర్సు లాక్కున్నారు. అట్టి పర్సు నందు రూ.1200 కలవని, ఆ ముగ్గురు వ్యక్తులను చూచినచో గుర్తుపట్టగలని బాధితుడు కిష్టయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను చాకుతో బెదిరించి, కొట్టి, పర్సు, డబ్బు గుంజుకున్న వ్యక్తులపై తగు చట్టరిత్య చర్య తీసుకోవాలని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ వెల్లడించారు. నర్సాపూర్‌లో వరుస రాబరీలు చోటుచేసుకోవడంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.