మునిపల్లి, నవంబర్ 11: ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మల్లారెడ్డిపేట శివారులోని సింగూర్ బ్యాక్ వాటర్ సమీపంలోని ఇరిగేషన్ శాఖకు చెందిన భూమి నుంచి ఓ వ్యాపారవేత్త దర్జాగా కాలువ తీయించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి సింగూర్ బ్యాక్ వాటర్ రావద్దనే ఉద్దేశంతో సదరు వ్యాపారవేత్త ప్రభుత్వ భూమి నుంచి దర్జాగా కాలువ తీసి నీళ్లు రాకుండా చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్లారెడ్డిపేట శివారులో ఆ వ్యాపారవేత్త కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి చుట్టూ రోడ్డు వేసే క్రమంలో ఎఫ్టీఎల్ భూముల్లో తవ్వకాలు చేస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాడని మల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ శివజ్యోతి, మాజీ ఉప సర్పంచ్ రాజు గ్రామస్తులతో కలిసి గత సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మంగళవారం సింగూరు బ్యాక్ వాటర్ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జరపడంతో గ్రామస్తులు మరోసారి అధికారులకు సంప్రదించారు. ఎట్టకేలకు స్పందించిన రెవెన్యూ అధికారులు సింగూర్ బ్యాక్ వాటర్ సమీపంలో నడుస్తున్న జేసీబీని సీజ్ చేశారు.
జేసీబీని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నామని గ్రామస్తులకు చెప్పి, సింగూర్ బ్యాక్ సమీపం నుంచి మల్లారెడ్డిపేట గ్రామ శివారులోకి తెచ్చి వదిలేయడంపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో వ్యాపారవేత్తపై చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడి పీఏ అంటూ వ్యాపారవేత్త అనుచరుడు ఘటనా స్థలానికి చేరుకుని రెవెన్యూ అధికారులపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో జేసీబీని కబ్జాదారులు తీసుకెళ్లారు. కలెక్టర్ ప్రావీణ్య స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.