గుమ్మడిదల, జూన్ 23: నిషేధిత మాదక ద్రవ్యాలను తయారుచేసి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్న దురుద్దేశంతో అక్రమార్కులు డ్రగ్స్ తయారీకి పాలు పడుతున్నారు. పగలంతా జల్సాలు చేస్తూ రాత్రివేళలో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. నిషేధిత డ్రగ్స్ ఆల్ఫాజోలం, డైజోఫాం మత్తు పదార్థాలను తయారుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. మారుమూల ప్రాంతాలు, మూతపడిన పరిశ్రమలను, పాడుబడ్డ భవనాలు, కోళ్ల ఫారాలను కేంద్రాలుగా మార్చుకుని తయారుచేస్తున్నారు. న్యాబ్ అధికారులు, పోలీసులు సంగారెడ్డి జిల్లాలో ఏడు నెలల్లో మూడు డ్రగ్స్ తయారీ కేంద్రాలను గుర్తించి వాటిని గుట్టురట్టు చేశారు. కోట్లాది రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలైన పాశమైలారం, ఫసల్వాది, బొల్లారం, బొంతపల్లి, గడ్డపోతారం, కాజీపల్లి తదితర పారిశ్రామికవాడల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. వలస కార్మికులు, విద్యార్థులు, యువతను టార్గెట్ చేసి మత్తు పదార్థాలను అంటగట్టి వాటికి బానిసలుగా చేస్తున్నారు. ఆల్పాజోలం, డైజో ఫామ్ వంటి మత్తు పదార్థాలను తయారు కల్లు దుకాణాల్లో విక్రయించి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు.
చిన్నపాటి కేంద్రాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ తయారీ చేస్తున్నారు. ఇందులో చిన్న రియాక్టర్, యం త్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. రసాయన పరిశ్రమల్లో పనిచేస్తున్న కెమిస్ట్‌లు, డ్రగిస్ట్లకు డబ్బులు ఆశచూపి మత్తు పదార్థాలు తయారుచేయిస్తున్నారు. మూతపడిన పరిశ్రమలు, పాడుబడ్డ భవనాలు, కోళ్ల ఫారాలు, జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకుని యథేచ్ఛగా డ్రగ్స్ తయారీకి చేస్తున్నారు. ఎవరూ గుర్తుపట్టలేని విధంగా పగలంతా కోళ్లఫారం నిర్వహిస్తూ, రాత్రివేళలో డ్రగ్స్ తయారీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామశివారులో కోళ్ల ఫారం అడ్డాగా చేసుకుని తయారుచేస్తున్న డ్రగ్స్ కేంద్రాన్ని గుర్తించి న్యాబ్ అధికారులు, పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో రూ.కోటి విలువ చేసే ఆల్ఫాజోలం పట్టుకుని, నిందితులను అరెస్ట్ చేశారు.
జిల్లాలో సీజ్ చేసిన డ్రగ్స్ కేంద్రాల వివరాలు..
సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది గ్రామశివారులో గతేడాది డిసెంబర్లో ఓ ఇంట్లో నిషేధిత ఆల్ఫాజోలం తయారు చేస్తున్న ముఠాను టీజీన్యాబ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడిచేసి రూ.70లక్షల విలువైన మత్తు పదార్థాలు,ముడి సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో నార్థజీపమ్ డ్రగ్స్‌ను డిసెంబర్లో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, పోలీసులు దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు.
మూడు రోజుల క్రితం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామశివారులో జనసంచారం లేని ప్రాంతంలో వ్యవసాయభూమిని లీజ్‌కు తీసుకుని కోళ్లఫారం నిర్వహిస్తూ ఆల్ఫాజోలం తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. రూ. కోటి విలువ చేసే ఆల్ఫాజోలం, ముడిసరుకులు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి టీజీ న్యాబ్, పోలీసు శాఖ ఆధ్వర్యం లో తీవ్రంగా కృషిచేస్తున్నాం. నిషేధిత మత్తు పదార్థాల తయారీ, వాడ కం రెండూ నేరమే. డ్రగ్స్ తయారు చేసిన వారిపై, వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గుట్టుచప్పుడు కాకుం డా ఎక్కడైనా నిషేధిత మత్తు పదార్థాలు తయారుచేస్తుంటే పోలీసులకు సమాచారం ఇస్తే దాడులు చేసి చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. ప్రజలు ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి. జిల్లా లో నిఘా పెట్టి డ్రగ్స్ నిర్మూలకు చర్యలు తీసుకుంటున్నాం.