న్యాల్కల్, సెప్టెంబర్ 19: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గణేశ్‌పూర్ శివారులోని నిమ్జ్ ప్రాజెక్టు భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఎర్రరాయి గనులపై గురువారం జిల్లా మైనింగ్ శాఖాధికారులు దాడులు చేశారు. ఈనెల 12న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిలో ప్రచురితమైన ‘నిమ్జ్ భూముల్లో అక్రమ తవ్వకాలు’ అనే శీర్షికకు అధికారులు స్పందించారు. జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ నాగరాణి నిమ్జ్ భూముల్లో అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మైనింగ్ శాఖ ఏడీ రఘు పర్యవేక్షణలో మైనింగ్ శాఖ రియల్టీ ఇన్స్పెక్టర్ సాయిరాం సిబ్బందితో కలిసి గణేశ్‌పూర్ శివారులో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఎర్రరాయి గనులపై దాడులు చేశారు. దాడుల విషయం తెలుసుకున్న అక్రమార్కులు రాయి కోత యంత్రాలు, జేసీబీ, హిటాచీతోపాటు ఎర్రరాయి లోడ్‌తో ఉన్న ట్రాక్టర్లు, లారీలను తీసుకుని పరుగులు పెట్టారు. అధికారులకు యంత్రాలు, లారీలు, ట్రాక్టర్లు కనబడకుండా గనుల సమీపంలోని పంట పొ లాలు, పొదల్లో దాచిపెట్టారు. దాడుల్లో రెండు ట్రాక్టర్లు, ఒక లారీని అధికారులు పట్టుకున్నారు.
అధికారులు గనుల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఎర్రరాయి గనుల్లో అక్రమంగా తవ్విన రాయిని తీసుకెళ్తున్న లారీ, ట్రాక్టర్‌ను హద్నూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిమ్జ్ భూముల్లో ఎలాంటి తవ్వకాలు చేపట్టారదన్నారు. ఇక నుంచి తరుచుగా ఎర్రరాయి గనులపై దాడులను చేపడుతామన్నారు. మండలంలోని హద్నూర్, న్యామతాబాద్, మల్కన్పాడ్, రేజింతల్ గ్రామ శివారులోని భూముల్లో అనుమతి లేకుం డా ఎర్రరాయిని తవ్వితే కఠిన చర్యలు తప్పవని జిల్లా మైనింగ్ శాఖ రియల్టీ ఇన్స్పెక్టర్ సాయిరాం హెచ్చరించారు. ఈ దాడుల్లో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యాం రావు, సర్వేయర్ లాల్‌సింగ్, పోలీసులు పాల్గొన్నారు.