సిద్దిపేట, ఫిబ్రవరి 11: క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని, గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ కప్‌కే దకిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్లో విజేతగా నిలిచిన అంబేద్కర్ ఆజాద్ జట్టుకు రూ.2 లక్షల నగదు బహుమతితో పాటు ట్రోఫీ, రన్నరప్‌గా నిలిచిన మిట్టపల్లి జట్టుకు రూ.లక్ష నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన ఆఫ్రిదికి రూ.50 వేల నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. సిద్దిపేటలో అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పించామని, దీనిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు తనవంతు ప్రోత్సాహం ఉంటుందన్నారు.
చేర్యాల, ఫిబ్రవరి 11: వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సూర్య నమస్కారాల పోటీల్లో చేర్యాలకు చెందిన యోగా అభ్యాసకురాలు, కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న మంతపురి హాసిని రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. ఈ పోటీల్లో 400 మందికి పైగా పాల్గొనగా, హాసిని 661 సూర్య నమస్కారాలతో మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా బంగారు పతకంతో పాటు రూ.5 వేల నగదు బహుమతి అందుకుంది.