మెదక్ అర్బన్, మార్చి 20: మంత్రాలతో సమస్యలు పరిష్కరిస్తానని నమ్మించి మహిళలకు మత్తు మందు ఇచ్చి శారీరకంగా వాడుకుని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న దొంగ జ్యోతిష్యుడిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి అలియాస్ శివస్వామి జ్యోతిష్యం చెబుతూ ఆర్యోగం మెరుగు పేరిట పలు పూజలు చేస్తుంటాడు.
మెదక్‌తో పాటు పలు జిల్లాల్లో సంచరిస్తూ జ్యోతిష్యం చెప్పేవాడు. వివిధ సమస్యలతో తనవద్దకు వచ్చిన మహిళలకు నిమ్మకాయ, పసుపు కుంకుమ వాసనలు చూపించి, నీటిలో నిద్రమాత్రలు కలిపి తాగించేవాడు. సదరు మహిళ స్పృహ కోల్పోయిన తర్వాత శారీరకంగా అనుభవించి మొబైల్లో వీడియోలు తీసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళలకు ఫోన్ చేసి నగ్నంగా వీడియోలు ఉన్నాయని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసేవాడు.
బాధిత మహిళల ఆర్థిక స్తోమతను బట్టి వేల నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేసి వసూలు చేసేవాడు. వసూలు చేసిన డబ్బులతో ఐఫోన్, బైక్ వినియోగిస్తూ రాజబోగాలు అనుభవిస్తున్నాడు. ఫిర్యాదుల మేరకు మెదక్ జిల్లా పోలీసులు అతడిపై నిఘా పెట్టి నర్సాపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద మంత్రాలకు సంబంధించిన సామగ్రితో పాటు షర్నకోల, పసుపు, కుంకుమ, గజ్జెలు, స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.