కొండాపూర్, మే 18: ఆపరేషన్ ఘోస్ట్ట్లో భాగంగా అస్సాంకు చెందిన మోఫిజుల్ ఇస్లాం(19) అనే వ్యక్తిని అస్కాం టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సంగారెడ్డి జిల్లా గొల్లపల్లిలో అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. మోఫిజుల్ ఇస్లాం సైబర్ క్రైమ్‌లకు పాల్పడడంతో పాటు దేశభద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు చేరవేస్తున్నట్లు అస్సాం టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాం నుంచి నకిలీ సిమ్‌కార్డులతో పాటు ఇతర పత్రాలను అస్సాం టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇస్లాంను అరెస్టు చేసిన అనంతరం అతనితో పాటు ఉన్న మరో ఆరుగురు అస్సాం వాసులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించి కొండాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో సంగారెడ్డి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి జిల్లాలో అస్సాం రాష్ర్టానికి చెందిన వ్యక్తుల్లో ఎవరైనా సైబర్ క్రైమ్, దేశభద్రతకు సంబంధించిన సమాచారం శత్రుదేశాలకు చేరవేస్తున్నారా అనేక కోణంలో గోప్యంగా విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. అస్సాం పోలీసులు, జిల్లా పోలీసుల వివరాల ప్రకారం అస్సాం రాష్ర్టానికి చెందిన మోఫిజుల్ ఇస్లాం తమ స్వగ్రామంలోని ఓ సెల్‌ఫోన్ దుకాణంలో పనిచేసేవాడు.
సెల్‌ఫోన్ దుకాణంలో ఉంటూ మోఫిజుల్ ఇస్లాం అక్రమంగా పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు ఉపయోగించేలా అస్సాం సిమ్‌కార్డులు అమ్ముతున్నాడు. పాకిస్థాన్ చెందిన వ్యక్తులు భారత్‌కు చెందిన సిమ్‌కార్డులు ఉపయోగించేలా వారికి ఓటీపీ నెంబర్లు చేరవేయడంతో పాటు దేశభద్రతకు సంబంధించిన సమాచారం వారితో పంచుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అస్సాం రాష్ట్రంలోని పలువురు దేశ భద్రతకు విఘాతం వాటిల్లేలా, ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోపాటు పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు సమాచారం చేరవేస్తున్నట్లు మిలటరీ ఇంటలిజెన్స్ గుర్తించి అస్సాం రాష్ట్ర పోలీసులకు సమాచారం అందజేసింది. దీంతో అప్రమత్తమైన అస్సాం పోలీసులు కొద్దిరోజులుగా ఆపరేషన్ ఘోస్టు పేరుతో అస్సాం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
అస్సాం రాష్ర్టానికి చెందిన వ్యక్తులపై నిఘా వేసి సైబర్ క్రైమ్ నేరాలతో పాటు దేశభద్రతకు సంబంధించిన సమాచారం పాకిస్థాన్ హ్యాండర్లకు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ రాకెట్‌తో సంబంధాలు ఉన్న అస్సాం రాష్ట్రంతో పాటు రాజస్థాన్, తెలంగాణలో ఉన్న వారిని అస్సాం టాస్క్ఫోర్సు పోలీసులు శనివారం అరెస్టులు చేశారు. ఇందులో భాగంగా అస్సాం నుంచి వచ్చి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో ఉంటున్న మోఫిజుల్ ఇస్లాంను టాస్క్ఫోర్సు పోలీసుల అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. గొల్లపల్లి సమీపంలో కుటుంబ సభ్యులతో ఉంటున్న మోఫిజుల్ ఇస్లాంను ఇంటిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు.
ఇస్లాంతో పాటు అతని కుటుంబ సభ్యులను విచారించారు. మోఫిజుల్ ఇస్లాం అక్రమంగా సిమ్‌కార్డులు అమ్మడంతో పాటు పాకిస్థాన్ హ్యాండర్లకు దేశభద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం చేరవేసినట్లు అస్సాం టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్థారించుకుని అరెస్టు చేసి తమ వెంట తీసుకెళ్లారు. మోఫిజుల్ ఇస్లాం వద్ద నుంచి నకిలీ సిమ్‌కార్డులను పెద్ద సంఖ్యలో అస్సాం టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మోఫిజుల్ ఇస్లాంతో పాటు గొల్లపల్లిలోని ఓ బీరు కంపెనీలో పనిచేస్తున్న అస్సాం రాష్ర్టానికి చెందిన ఏడుగురు వ్యక్తులను అస్సాం టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారించారు.
వారి వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కొండాపూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. అస్సాం రాష్ట్రంలో అక్రమంగా సిమ్‌కార్డులు విక్రయించటంతోపాటు సైబర్‌క్రైమ్‌లకు పాల్పడుతున్నట్లు స్థానిక పోలీసులు గుర్తించటంతో అప్రమత్తమైన మోఫిజుల్ ఇస్లాం అక్కడి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సంగారెడ్డి జిల్లాలోని గొల్లపల్లికి వచ్చినట్లు తెలిసింది. మోఫిజుల్ ఇస్లాం పదిరోజుల క్రితం గొల్లపల్లి వచ్చి బీరు కంపెనీలో అస్సాంకు చెందిన కార్మికులతో కలిసి గోదాం నిర్మాణంలో కార్మికునిగా పనిచేస్తున్నట్లు సమాచారం.