సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 6 : రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడంతో వరినారు ఎదుగక పంటకు తెగుళ్లు సోకే అవకాశముంటుంది. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంట పొందవచ్చునని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. గత వర్షాకాల పంటలకంటే యాసంగిలో రైతులు వరిపంటను అధికంగా సాగు చేసే అవకాశమున్నందున వరి పంటలను సాగుచేసే రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన రసీదును భద్రపర్చుకోవాలి. విత్తనాలు మొలకెత్తే సమయంలో సమస్యలు వస్తే దుకాణదారుపై చర్యలు తీసుకోచ్చు.
నారుమడిలో రక్షణ చర్యలు..
నారు పోసిన నాలుగైదు రోజులు తరువాత నారుమడిలో కిలో యూరియా, 2కిలోల డీఏపీ, కిలో పొటాష్‌ను చల్లాలి. చలి తీవ్రతతో నారుమడి ఎరుపు రంగులోకి మారి చనిపోతుంది. దీని నివారణకు 2గ్రాముల జింక్ సల్ఫేట్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
నారుమడిలో ఆకుపచ్చ తెగుళ్లు కనిపిస్తే కార్బండిజం 1.5 గ్రాములను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మళ్లీ నాలుగైదు రోజుల వ్యవధిలో నారుమడి ఎరుపు రంగులోనే ఉంటే ఫార్ములా-4, ఫార్ములా-5ను రెండుసార్లు పిచికారీ చేయాలి. దీంతో సూక్ష్మదాతు లోపాన్ని నివారించవచ్చు.
గడిచిన వానకాలం సీజన్ అనుభవాలను దృష్టిలో ఉంచు కుని ఈసారి వరిపై కాండం తొలుచు పురుగు ప్రభావం ఉంటుంది. కాబట్టి నారుమడి వేసిన 15 రోజులకోసారి కిలో కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను చల్లాలి. రెండో విడు తగా నాటువేసే వారం ముందు మరోసారి చల్లాలి.
సేంద్రియ పద్ధతిలో విత్తన శుద్ధి..
ఐదు గ్రాముల సూడోమోనాస్ పొడిని కిలో విత్తనానికి ఒక లీటర్ నీటిచొప్పున కలుపుతూ 30 కిలోల విత్తనానికి సరిపడే ద్రావణాన్ని తయారు చేయాలి. ఈ ద్రావణంలో విత్తనాలను 12 నుంచి 24 గంటలపాటు నానబెట్టాలి.
ఒకవేళ కొత్త విత్తనాలు వేయదలిస్తే మొలకశాతం పెరగడానికి నత్రికామ్లం 30 మిల్లీ లీటర్లను 50 లీటర్ల నీటిలో కలిపి 12గంటలు నానబెట్టాలి.
ఈ సీజన్లో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి మామూలు విధానం కంటే పొలంలో 10 సెంటిమీటర్ల ఎత్తులో బెడ్డును ఏర్పాటు చేసి నారు పోయాలి. దీంతో చలి నుంచి కొంత మేర రక్షించవచ్చు.
రసాయనాలతో విత్తన శుద్ధి..
తడి పద్ధతి విధానంలో లీటర్ నీటికి 1.5 గ్రాముల కార్బండిజం పొడిని కలిపి 30 కేజీలకు సరిపడే ద్రావణాన్ని తయారు చేయాలి. ఈ ద్రావణంలో 12 నుంచి 24 గంటల వరకు విత్తనాలను నానబెట్టాలి.
పొడి విధానంలో 3 గ్రాముల కార్బండిజం పొడిని కిలో విత్తనానికి బాగా పట్టించాలి.
నాటువేసే సమయంలో..
25 నుంచి 30రోజుల నారును మాత్రమే నాటుకోవాలి.
నాటువేసే సమయంలో నారు చివరి ఆకులను తుంచి నాటితే మంచిది.
నాటువేసే ముందు క్లోరోపైరిపాస్ 2.5మి.లీ మందును లీటర్ నీటికి కలిపి 50లీటర్ల ద్రావణాన్ని తయారు చేయాలి. ఈ ద్రావణంలో నారును నానబెట్టి నాటుకోవాలి. దీంతో రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు.
చలినుంచి కాపాడేందుకు..
రాత్రి వేళల్లో నారుమడిలో నీటిని తీసి వేసి ఉదయాన్నే వెచ్చని బోరునీటిని పెట్టాలి.
ఎత్తైన నారుమడిపైనే నారును పెంచాలి..
మంచు ప్రభావంతో నారుమడి చనిపోతుంది. కాబట్టి, నారుమడి చుట్టూ కొంత ఎత్తులో కట్టెలను కట్టి వాటిపై పాతబట్టలను కానీ, పాలిథిన్ కవర్లను కానీ కప్పాలి.
సూక్ష్మ పోషకాల నివారణకు జింకు సల్ఫేట్ ఫార్ములా 4, 5లను పిచికారీ చేసుకోవాలి. పై జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యకరమైన నారుమడితో అధిక
దిగుబడి పొందవచ్చు.
జాగ్రత్తలు పాటించాలి..
యాసంగిలో ముఖ్యంగా వరినార్లు పోసుకునే రైతులు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ముందుగా వ్యవసాయాధికారులను ఆశ్రయించి సరైన జాగ్రత్తలు పాటించాలి. మొలకెత్తే దశలోనే తెగుళ్లు సోకే అవకాశమున్నందున రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. యాసంగిలో రైతులు వరిపంటను అధికంగా సాగు చేసే అవకాశమున్నందున వరి పంటలను సాగుచేసే రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన రసీదును భద్రపర్చుకోవాలి.
– వెంకట రమణి, ఏవో, నారాయణరావుపేట