మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట అర్బన్/ సంగారెడ్డి కలెక్టరేట్, మే 18: గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీఎస్పీ ఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ నోడల్ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. కేటాయించిన పరీక్ష కేంద్రాలను కలెక్టర్లు, నోడల్ అధికారులు పలుమార్లు సందర్శించి అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ, హెల్త్, ట్రాన్స్కో, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ జిల్లాలోని 21 పరీక్షా కేంద్రాల్లో 8,239 మంది అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 10 కేంద్రాల్లో దాదాపు 4000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం డిపార్ట్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లతో పాటు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను, రూట్ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ… జిల్లాలో 9,672 మంది అభ్యర్థులకు 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సీసీ కెమెరాలతో పాటు పరీక్ష సజావుగా నిర్వహించేందుకు లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఆయా జిల్లాల పోలీస్ నోడల్ అధికారులు, అడిషనల్ డీసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.