జహీరాబాద్, మే 20 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, ఝరాసంగంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈనెల 23న జహీరాబాద్ పర్యటనలో భాగంగా ఝరాసంగం మండలంలోని నిమ్జ్ ప్రాజెక్టు ప్రత్యేక రోడ్డుతో పాటు జహీరాబాద్ పట్టణ సమీపంలోని హుగ్గెలి చౌరస్తాలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
జహీరాబాద్లోసీఎం పర్యటన విజయవంతానికి సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పనులు పర్యవేక్షిస్తున్నారు. సీఎం చేతుల మీదుగా చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రదేశాల్లో రోడ్లకు కలరింగ్‌తో పాటు అల్గోల్ చౌరస్తాలో హెలిప్యాడ్, బహిరంగ సభ స్థల పరిసరాల్లో ముళ్లపొదలు, చెత్తా చెదారాన్ని జేసీబీలతో తొలిగించి శుభ్రం చేస్తున్నారు. పోలీసులు హెలిప్యాడ్, బహిరంగ సభ జరిగే ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్ పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటించే రూట్ మ్యాప్‌లో భాగంగా హెలిప్యాడ్, బహిరంగ సభ వేదిక, నిమ్జ్ ప్రత్యేక రోడ్డు, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పరిసరా ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక పోలీసు అధికారులు, ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ సంజీవ్‌రావు, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, పట్టణ, రూరల్ సీఐ శివలింగం, హనుమంతు, ఎస్సైలు కాశీనాథ్, ప్రభాకర్‌రావు తదితరులు ఉన్నారు.