సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 5: సంగారెడ్డిలోని కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఈ నెల 26న దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడు అడుగుల ఎత్తుగల విగ్రహా న్ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఎకరా 23 గుంటల భూమిలో కురుమ సంఘం భవనం, విద్యార్థుల కోసం హాస్టల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కురుమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలిసిన కురుమ సంఘం జిల్లా నాయకులు విగ్రహావిష్కరణ తేదీని ఖరారు చేసుకున్నారు.
పెద్ద ఎత్తున తరలి రావాలి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిష్కరించనున్న దొడ్డి కొమురయ్య విగ్రహానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి. మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ ఉంటుంది. కురుమ సంఘం భవనం, విద్యార్థుల కోసం నిర్మించే హాస్టల్ భవనానికి భూమి పూజ కూడా చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టానికి బాటలు వేసిన దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉన్నది.
– బూరుగడ్డ నగేశ్ కురుమ