మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 12: జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఎలాంటి పొరపాటు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, కంటి వెలుగు కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని వైద్య బృందాలు, సమీప పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్లో నైట్ హాల్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాల్లో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఆర్పీలు, వీవోఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలుపాలని మంత్రి ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించేందుకు స్థానిక సంస్థల అధికారులకు విధులు నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, కంటి వెలుగు బృందాలతో ఎప్పటికప్పుడూ మాట్లాడాలని కలెక్టర్‌కు సూచించారు.
60శాతం మందికి పరీక్షలు: మెదక్ కలెక్టర్ హరీశ్
మేడ్చల్ జిల్లా నుంచి జూమ్ మీటింగ్‌లో మెదక్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా జనాభాలో 4,72, 802 (60 శాతం) మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు గ్రామ స్థాయిలో 35 టీంలు, పట్టణ స్థాయిలో 5 టీంలతో పాటు 5 బఫర్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని 469 గ్రామ పంచాయితీలు, నాలుగు మున్సిపాలిటీల్లోని 75 వార్డులో 544 శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 40 ఏఆర్ మిషన్లు, 32,596 ట్రయల్ ఫ్రేమ్స్ వచ్చాయన్నారు. ఈనెల 18 నుంచి జూన్ 26 వరకు 100 రోజుల పని దినాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందునాయక్, డీపీవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
సిద్ధంగా ఉన్నాం: సంగారెడ్డి కలెక్టర శరత్
సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని మంత్రికి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 854 శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, 69 బృందాలతో క్యాంపులు నిర్వహిస్తున్నామని, అవసరమైన సామగ్రి అందుబాటులో ఉన్నదని తెలిపారు. జిల్లాకు ఇప్పటివరకు 64,900 రీడింగ్ గ్లాసులు వచ్చాయని, ట్యాబులను సాఫ్ట్‌వేర్‌తో సిద్ధం చేసామన్నారు. సూక్ష్మ ప్రణాళిక అందరికీ పంపిస్తామన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. పంచాయతీ స్థాయిలో సర్పంచ్‌లు, వార్డు మెంబ ర్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లకు గురువారం నుంచి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలోని రేషన్ దుకాణాల వద్ద కంటి వెలుగు శిబిరాల సమాచార ఫ్లెక్సీలు, పట్టణ కూడళ్లలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రసవాల్లో రాష్ట్రంలోనే సంగారెడ్డి టాప్
ప్రభుత్వ దవాఖానల్లో 86 శాతం ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా టాప్‌లో ఉన్నదని మంత్రి తెలిపారు. అందుకు కృషి చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆరోగ్య బృందాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో 100 శా తం ప్రసవాలు జరిగేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో జిల్లా నుంచి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, డీపీవో సురేశ్ మోహన్, వైద్యులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
జిల్లాలో కంటి వెలుగుకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు 100 శాతం మొబిలైజేషన్ చేసేలా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని ఎంపీవో, ఎంపీడీవో, తహసీల్దార్, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రతి రోజు వారి పరిధిలో గల క్యాంపులు తనిఖీ చేయాలన్నారు. జిల్లా స్థాయిలో డీఎం అండ్ హెచ్‌వో, ఇతర ప్రోగ్రాం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేసేలా ఆదేశించామన్నారు. అన్ని పంచాయతీల్లో ఆశా, ఏఎన్ఎమ్, అంగన్వాడీ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తారని, మూడు రోజుల ముందు టామ్ టామ్ వేయించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.