దుబ్బాక, డిసెంబర్ 9: దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరమ్మ కమిటీ సమావేశం రసాభసగా మారింది. సొంత స్థలం ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సోమవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో.. పలువురు కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం చూపారు.
ఇందిరమ్మ కమిటీ సభ్యులే కాకుండా మరికొందరు కాంగ్రెస్ నాయకులు పార్టీ కండువాలతో సమావేశానికి రావడంపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశ మందిరంలో కౌన్సిలర్లు కూర్చునేందుకు కనీసం కుర్చీలు లేకుండా కాంగ్రెస్ నాయకులు రావడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు కమిషనర్‌ను ప్రశ్నించారు. దుబ్బాకలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లకు, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో అర్ధంతరంగా సమావేశాన్ని ముగించారు. ఇందిరమ్మ కమిటీ సమావేశం నిర్వహణ రసాభసగా మారడానికి మున్సిపల్ అధికారుల సమన్వయ లోపమే కారణమని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ సమావేశం కాదు:
సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీ సమావేశంలో విధివిధానాలు పాటించకుండా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించడం హాస్యాస్పదమని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఇందిరమ్మ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కండువాలతో వచ్చి, గొడవకు దిగారని వివరించారు. ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటాలు చేస్తుంటే.. మరోపక్క ఆ పార్టీ నాయకులే పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని మం డిపడ్డారు.
ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సరి గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీలో కౌన్సిలర్, వార్డు అధికారితో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు సభ్యులను చేర్చడాన్ని తప్పుపట్టారు. ఇందిరమ్మ కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ సమావేశంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత నెలకొందని, కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో వైస్ చైర్పర్సన్ సుగుణాబాలకిషన్, కౌన్సిలర్లు లలిత, మీన, సులోచన, శ్రీనివాస్, స్వామి ఉన్నారు.