సిద్దిపేట, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మోటర్లు ఆన్‌చేసి సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీమంత్రి హరీశ్‌రావు హెచ్చరికలకు ప్రభుత్వం స్పందించింది. సోమవారం ఉదయం రంగనాయక సాగర్‌లోకి 3,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసింది. మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్లలోకి నీటిని విడుదల చేసేలా అధికార యంత్రాంగం ప్రణాళిక సిద్ధ్దం చేసింది. గొలుసుకట్టు క్రమంలో అన్ని రిజర్వాయర్లలోకి కాళేశ్వర జలాలు పంపింగ్ చేయనున్నారు. వారం కిందట రాష్ట్ర భారీ నీటి పారదుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ సైతం రాశారు.
ఆదివారం సిద్దిపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నీటిని విడుదల చేయాలని గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని నింపాలని కోరారు. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి రిజర్వాయర్లు నింపాలని లేఖ ద్వారా, మీడియా సమావేశం ద్వారా హరీశ్‌రావు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ఫలితంగా ప్రభుత్వంలో కదిలిక వచ్చి పంపింగ్ ప్రారంభించడంతో సిద్దిపేట జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని నేతలు, రైతులు రంగనాయక సాగర్ వద్దకు ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ రిజర్వాయర్ 3 టీఎంసీల సామర్ధ్యానికి ప్రస్తుతం టీఎంసీ నీళ్లు ఉన్నాయి. రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో 3 టీఎంసీలకు టీఎంసీ నీళ్లు ఉన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ 50 టీఎంసీలకు 10 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలకు ప్రస్తుతం 4 టీఎంసీలు, బస్వాపూర్ రిజర్వాయర్‌లో 12 టీఎంసీలకు ప్రస్తుతం అర టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈ రిజర్వాయర్లన్నీ నింపితే చెరువులు, కుంటలకు గోదావరి జలాలను తరలించి నింపవచ్చు. తద్వారా యాసంగి సాగకు నీళ్లివ్వవచ్చు. ఆ దిశగా ప్రభుత్వం అన్ని రిజర్వాయర్లను నింపాలని రైతులు కోరుతున్నారు.