సంగారెడ్డి, జూన్ 19(నమస్తే తెలంగాణ): కాలం కలిసివచ్చినా చేతిలో కాసులు లేక సంగారెడ్డి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే వర్షాలు బాగా కురుస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు చేతుల్లో పైసలు లేవు. దీంతో రైతులు పంట పెట్టుబడి సాయం(రైతు భరోసా), పంట రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం రైతుభరోసాపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాం టి ప్రకటన చేయలేదు. కేసీఆర్ సర్కారు ఎలాంటి ఆం క్షలు లేకుండా ప్రతి రైతు ఖాతాల్లో రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం ఎకరాకు రూ.5 వేల చొప్పున సీజన్‌కు ఠంఛన్‌గా జమ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా అందజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన కానీ, మార్గదర్శకాలు కానీ జారీ చేయ లేదు. దీంతో రైతులు రైతుభరోసా ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. దీనికితోడు జిల్లాలో బ్యాంకర్లు కొత్తగా పంట రుణాలు ఇవ్వడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కాలేదు. దీంతో కొత్త పంట రుణాలు అందక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 18వ తేదీ వరకు 53.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురువాల్సి ఉండగా, 93.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 74.6 శాతం ఎక్కువగా వర్షం కురిసింది. వానకాలం ప్రారంభానికి ముందు జిల్లాలో విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రధాన పంటలకు సంబంధించిన వరి, పత్తి, కంది, పెసర, మినుము విత్తనాలను, ఎరువులను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది. జిల్లాలో వానకాలం సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 7,24,405 ఎకరాలు కాగా, రైతులు ఇప్పటి వరకు 1.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. 1.43 లక్షల ఎకరాల్లో పత్తి, 6,320 ఎకరాల్లో సోయా, 5,790 ఎకరాల్లో కంది, 695 ఎకరాల్లో పెసర, 590 ఎకరాల్లో మినుము, 636 ఎకరాల్లో మొక్కజొన్న, 2,440 ఎకరాల్లో చెరుకు పంటలు సాగు చేశారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తుండటంతో పంటల సాగు క్రమంగా ఊపందుకుంటున్నది.
సంగారెడ్డి జిల్లాలో చిన్న, సన్నకారు రైతుల చేతిలో చిల్లిగవ్వలేక విత్తనాలు, ఎరువున కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వానకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ సర్కారు రైతుబంధు ద్వారా 3,59,010 మంది రైతులకు రూ.375 కోట్లు అందజేసింది. ప్రస్తుతం జిల్లాలోని 3.62 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరిట పెట్టుబడి సాయం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చింది. రైతుభరోసా అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాం టి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో రైతుభరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని రైతులు పంట రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు పంట రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ కాక, కొత్త పంట రుణా లు అందక వానకాలం సాగుకు పెట్టుబడి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లో ఇప్పటి వరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కాలేదు. ఇదివరకే వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కావా ల్సి ఉన్నప్పటికీ బ్యాంకర్లు, జిల్లా యంత్రాంగం ఇంతవరకు రుణ ప్రణాళికను ఖరారు చేయలేదు. వార్షిక రుణ ప్రణాళిక ప్రకటించకపోవటంతో జిల్లాలోని బ్యాం కర్లు కొత్తగా రుణాల కోసం బ్యాంకులకు వచ్చిన రైతులను తిప్పిపంపుతున్నారు. దీంతో దిక్కుతోచక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.