రామచంద్రాపురం,జూలై 16 : సంగారెడ్డి జిల్లా భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లోని ఎంఎంటీఎస్ రోడ్డు వెంట అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే ముక్కుమూసుకోవాల్సి వస్తున్నది. ఈఎస్ఐ దవాఖాన రోడ్డు నుంచి మ్యాక్ సొసైటీ, ఎంఐజీ కాలనీలకు వెళ్లేందుకు వాహనదారులు ఈ మార్గం నుంచే ప్రయాణిస్తుంటారు. రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం పేరుకుపోవడంతో తీవ్రమైన దుర్వాసన వస్తున్నది.
ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు దుర్వాసనతో నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూమి బీహెచ్ఈఎల్కు చెందినది కావడంతో వాటిపై పర్యవేక్షణ లేక చెత్తాచెదారంతో ఆ ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. ఈ సమస్యపై పలుమార్లు భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి స్పందించి భెల్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందితో ఆ పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ విషయంలో భెల్ మేనేజ్మెంట్ అభ్యంతరం చెప్పడంతో జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు.
భెల్ మేనేజ్మెంట్నే పరిసరాలను శుభ్రం చేయించాలని కార్పొరేటర్, జీహెచ్ఎంసీ అధికారులు చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆ ప్రాంతం మరింత అపరిశుభ్రంగా మారి దుర్వాసనతో పాటు దోమల బెడద ఎక్కువైంది. భెల్ ఖాళీ ప్రదేశాలను ఆనుకొని మ్యాక్సొసైటీ కాలనీ ఉండడంతో అక్కడ నివాసం ఉండే వారు ఈ చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా భెల్ మేనేజ్మెంట్ స్పందించి జీహెచ్ఎంసీ వారికి సహకరించి పరిసరాలను శుభ్రం చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భారతీనగర్ డివిజన్లోని ఎంఎంటీఎస్ రోడ్డు మార్గంలో చెత్తడంపింగ్ ప్రధాన సమస్యగా మారింది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా భెల్ మేనేజ్మెంట్ స్పందించడం లేదు. ప్రజల ఇబ్బందులు చూడలేక కొన్నిసార్లు ఆ పరిసరాలను సొంతంగా శుభ్రం చేయించాం. కాలనీవాసుల కోసం శుభ్రం చేయిస్తే భెల్ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇటీవల జో నల్ కమిషనర్ని పిలిచి పరిస్థితిని చూపించాం. భెల్ ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ వేసి గ్రీనరీగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని జోనల్ కమిషనర్, భెల్ అధికారులు, తాము ఓ నిర్ణయానికి వచ్చాము. దీనికి భెల్ మేనేజ్మెంట్ సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ నేటికి కార్యాచరణ జరగడం లేదు. కాలనీవాసుల సమస్య పరిష్కారానికి నావంతు కృషి చేస్తా.
– సింధూఆదర్శ్రెడ్డి, భారతీనగర్ కార్పొరేటర్, సంగారెడ్డి జిల్లా