అందోల్, ఏప్రిల్ 21: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చోరీ చేస్తుండగా చూసి పట్టించాడనే కక్షతో ఓ బాలుడిని అంతమొందించాడు. ఆపై బంధువులకు భయపడి సెల్‌టవర్ ఎక్కి నానా హంగామా చేయడంతో పాటు అడ్డం వచ్చిన వారిపై కత్తితో దాడిచేసి చివరకు అదే సెల్ టవర్‌పై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జోగిపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనకు సంబంధించి పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. జోగిపేటకు చెందిన వడ్డె నాగరాజు (35) పట్టణం లో చోరీలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో పలు చోరీలు చేసి జైలుకు వెళ్లి రావడం, స్థానిక వ్యాపారులను బెదిరించడం దినచర్యగా మార్చుకున్నాడు. శుక్రవారం దుకాణంలో కేబుల్ వైర్లు చోరీ చేయగా శేఖర్(13) అనే బాలుడు చూసి విషయం స్థానికులకు చెప్పాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న నాగరాజు శనివారం సాయం త్రం బాలుడిని ఊరి బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి… ఆపై రాయితో కొట్టి చంపి బావిలో పడేశాడు. అనంతరం ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో వారు కొడతారనే భయంతో శనివారం రాత్రి సెల్‌టవర్ ఎక్కి కూర్చున్నాడు. అతడిని కిందకు దించేందుకు వెళ్లిన ఇద్దరిపై కూడా కత్తితో దాడిచేసి గాయపర్చాడు. కిందకు దిగితే తనకు శిక్ష తప్పదని భావించి సెల్‌టవర్ కేబుల్ కట్‌చేసి అక్కడే ఉరివేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం వరకు నాగరాజు కదలకుండా ఉండడంతో పోలీసులు స్థానికుల సాయంతో టవర్ ఎక్కి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. దీంతో అతడి మృతదేహాన్ని దించి జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలుడు శేఖర్ మృతదేహాన్ని సైతం బావిలో గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు నాగరాజు శనివారం రాత్రి సైతం జోగిపేటకు చెందిన ప్రకాశ్ అనే వ్యాపారిపై దాడిచేసి తల పగులగొట్టడంతో ఆయన దవాఖానలో చికిత్స పొందుతున్నా డు. ఈ విషయంపై వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు జరగ్గా పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయని వ్యాపారులు తెలిపారు.