హుస్నాబాద్, అక్టోబర్ 28: కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతుకోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్‌ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు ఖరారు చేయడంతో శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని తన నివాసంలో ఆయన ఏడు మండలాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడే స్వయంగా టికెట్ వస్తుందని చెప్పి అనంతరం మోసం చేశాడన్నారు. 15నెలలుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీక్యాడర్ను ఐక్యం చేశానన్నారు. ఐదేండ్ల పాటు ఎమ్మెల్యేగా.. మరో ఐదేండ్లు పాటు కార్యకర్తలకు అండగా ఉన్నానని గుర్తుచేశారు. నియోజకవర్గానికి సంబంధం లేని వారికి టికెట్ ఖరారు చేసి నాకు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి స్థానికంగా ఉండే నాయకులు అసమర్థులుగా, స్థానికేతరులు సమర్థులుగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. పార్టీ అధిష్టానం తీరుతో కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. నయవంచన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎలా గుణపాఠం చెప్పాలో రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ప్రవీణ్‌రెడ్డి ఇంటికి వెళ్లి సపోర్ట్ చేయాలని కోరిన పొన్నం… ; విముఖత వ్యక్తం చేసిన ప్రవీణ్‌రెడ్డి
కాంగ్రెస్ అధిష్టానంటికెట్ ఖరారు చేయడంతో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ శనివారం అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించాలని కోరినట్లు సమాచారం. ఇందుకు ప్రవీణ్‌రెడ్డి విముఖత చూపారని తెలిసింది. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత చెప్తానని చెప్పడంతో పొన్నం నిరాశతో వెనుదిరిగారు. పొన్నం ప్రభాకర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వొద్దని ప్రవీణ్‌రెడ్డి వర్గీయులు తెగేసి చెప్పినట్లు సమాచారం. దీంతో హుస్నాబాద్ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో చీలికలు రావడం, సగం క్యాడర్ ప్రవీణ్‌రెడ్డి వెంటే ఉండటం వల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులే ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.