కొమురవెల్లి, మార్చి 15: విద్యార్థులు లక్ష్యంపై దృష్టిసారించి గమ్యానికి చేరుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(ఏఐ) కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ.. ఫౌండేషన్ లిటరసీ న్యుమరసీ (ఎఫ్ఎల్ఎన్) పోగ్రాం ద్వారా గణితం, తెలుగు అభ్యసన సామర్థ్యం పెంచేందుకు ఏఐని అమలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 31 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
శనివారం 29 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారభించినట్లు తెలిపారు. జిల్లాలో రూ.30 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 30 టాయిలెట్స్, అదనపు తరగతి గదులు, ప్రహరీలు తదితర నిర్మాణాలు చేపట్టామని, ఇందులో ఇప్పటి వరకు రూ.19 కోట్లు విడుదల చేశామన్నారు. గురువన్నపేట పాఠశాలలో చేపట్టిన నిర్మాణాలకు పెండింగ్‌లో ఉన్న రూ. 5లక్షల బిల్లులను వెంటనే అమ్మ ఆదర్శ కమిటీలకు విడుదల చేస్తామని తెలిపారు.
పాఠశాలకు అవసరమైన ప్రహరీ, ఐదు కంప్యూటర్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బస్ సౌకర్యం, సైన్స్ రూమ్, అదనపు తరగతుల గదిని విద్యార్థుల సంఖ్య పెరిగితే మంజూరు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాఠశాలలో తాము చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం అధికారులకు రూ.8 వేల లంచం ఇచ్చినట్లు పాఠశాల అమ్మ కమిటీ చైర్పర్సన్ అన్నబోయిన బాలమణి, ప్రాథమిక పాఠశాల అమ్మ కమిటీ చైర్పర్సన్ పుట్ట స్వప్న కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ చర్యలకు ఆదేశించారు.
గ్రామంలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉందని అనంతరం గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గురువన్నపేట నుంచి కుకునూరుపల్లికి బీటీ రోడ్డు మంజూరు చేయాలని, తపాస్‌పల్లి రిజర్వాయర్ ద్వారా గ్రామ చెరువులోకి నీళ్లు వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీఈవో ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి, సెక్టోరల్ అధికారి రామస్వామి, ఏఎస్వో భాస్కర్, మండల విద్యాధికారి రమేశ్, ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రమేశ్, అమ్మ కమిటీ పాఠశాల చైర్పర్సన్లు బాలమణి, స్వప్న, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.