కంది, సెప్టెంబర్ 15 : నూతన సాంకేతిక పద్ధ్దతులు అందిపుచ్చుకొని వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ డాక్టర్ పి.రాఘురాంరెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులకు సూచించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సంగారెడ్డి జిల్లా కందిలోని వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ డే నిర్వహించారు.
ఈ వేడుకలకు ప్రొఫెసర్ రఘరాంరెడ్డి, రిటైర్డ్ డీన్ డాక్టర్ కె.సదాశివరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రఘురాంరెడ్డి మాట్లాడుతూ..వాతావరణ మార్పులు తట్టుకునేలా, తక్కువ ఖర్చుతో లాభసాటి పంటలు పండేలా ప్రయోగాలు చేసి రైతులకు ఫలాలు చేరువ చేయాలప్పారు. కృత్రిమ మేథ, డ్రోన్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్ను విరివిగా వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మనోజ్‌కుమార్, ప్రొఫెసర్ డాక్టర్ డి.కల్పనా, కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కంది వ్యవసాయ కళాశాలలో 2011-2018 వరకు చదివిన 78మంది పూర్వ విద్యార్థులు నీటిపారుదల శాఖ,ఆయకట్టు అభివృద్ధి శాఖలో ఉద్యోగాలు సాధించారు. 2023 మేలో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఏఈఈ పోస్టులకు పరీక్షలు జరగగా,2023 జూలైలో ఫలితాలు వచ్చాయి. ఇందులో కంది వ్యవసాయ కళాశాలకు చెందిన 78మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిని ఘనంగా సన్మానించారు.