జిన్నారం/బొల్లారం, నవంబర్ 5 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి శివారులోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని బాలబోయిన వైష్ణవి(16) సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వారి కుటుంబంలో, కళాశాలలోని విద్యార్థుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విద్యార్థిని మృతిపై మంగళవారం నారాయణ కళాశాల ప్రధాన గేటు వద్ద కుటుంబీకులు బైఠాయించారు. దాదాపు మూడు గంటలపాటు బంధువుల రోదనలతో ఆ ప్రాంతం విషాదఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళన చేశాయి.బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ వరికుప్పల వాసు, కుత్బుల్లాపూర్ ప్రెసిడెంట్ అఖిల్, జనరల్ సెక్రటరీ యశ్వంత్‌కుమార్, నవ తెలంగాణ విద్యార్థి శక్తి(ఎన్టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కుమార్, జనరల్ సెక్రటరీ సాయికిరణ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు కళాశాల ఎదుట బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను చదువు పేరుతో మానసికంగా వేధిస్తున్నాయని మండిపడ్డారు. సమీపంలో ఉన్న మరో కళాశాలలో కొన్ని రోజుల క్రితం ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తు చేశారు.
కళాశాల వద్ద కుటుంబీకులు, విద్యార్థి సంఘాలు బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. బొల్లారం సీఐ గంగాధర్, జిన్నారం సీఐ సుధీర్‌కుమార్, బొల్లారం ఎస్ఐ రాములు, జిన్నారం ఎస్ఐ నాగలక్ష్మి సిబ్బందితో కళాశాల వద్ద మోహరించారు. జిన్నారం తహసీల్దార్ భిక్షపతి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. విద్యార్థిని వైష్ణవి మృతిపై తండ్రి పరశురామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పటాన్చెరు ప్రభుత్వ దవాఖానలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.