కంది, జూన్ 19 : ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్లి ఆరేండ్లుగా ఆచూకీ తెలియని అరుణ్‌రెడ్డి జాడను సంగారెడ్డి జిల్లా పోలీసులు కనుగొన్నారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ప్రత్యేక చొరవతో మిస్సింగ్ పర్సన్ అరుణ్‌రెడ్డి కేసును ఛేదించారు. కొడుకు జాడతెలియక ఆందోళనకు గురవుతున్న తల్లి సత్యాగామ మణెమ్మతో ఫిలిప్పీన్స్ దేశ నుంచి అరుణ్‌రెడ్డితో బుధవారం ఫోన్లో మాట్లాడించారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన సత్యగామ మణెమ్మ కుమారుడు అరుణ్‌రెడ్డి 2012లో ఎంబీబీఎస్ చదువు కోసం ఫిలిప్పీన్స్ దేశంలోని మాకాటి సిటీ కి వెళ్లాడు.
2018లో తండ్రి చనిపోతే కంది గ్రామానికి వచ్చి తిరిగి మళ్లీ ఫిలిప్పీన్స్ వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడం, ఫోన్లో మాట్లాడకపోవడం, ఫోన్ చేసినా లేపకపోవడంతో కుమారుడికి ఏమైందోనని తల్లి మణెమ్మ ఆందోళనకు గురైంది. ఆరేండ్ల నుంచి కొడుకు ఆచూకీ లేదని ఈనెల 10న జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి తన బాధను ఎస్పీకి విన్నవించింది. స్పందించిన ఎస్పీ వెంటనే ఐటీ సెల్ ఇన్స్పెక్టర్కు ఆదేశాలివ్వగా, మిస్సింగ్ పర్సన్ అరుణ్‌రెడ్డి పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్, ఫొటోస్ ఆధారాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ ఫిలిప్పీన్స్ ఎంబసీతో మాట్లాడి వారి సహాయంతో అరుణ్‌రెడ్డి ఆచూకీ తెలుసుకొని తల్లి మణెమ్మతో ఫోన్లో మాట్లాడించారు.