నిజాంపేట,మే5 : మిషన్ భగీరథ పథకం ద్వార ప్రతి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని భగీరథ ఏఈ భిక్షపతి అన్నారు. సోమవారం రజాక్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఖాసీంపూర్‌లో భగీరథ ఏఈ భిక్షపతి నీటి స్వచ్ఛతపై ఎలక్రోడ్ పరీక్షల ద్వారా గ్రామస్తులకు అవగాహన కల్పించి మాట్లాడారు. నీటి స్వచ్ఛతపై నిర్వహించిన పరీక్షల్లో బోరు నీటిలో అధికంగా లవణాలు ఉన్నాయని, ఫిల్టర్ చేయబడిన నీటిలో అస్సలు లవణాలు లేవన్నారు.
భగీరథ నీటిని పరీక్షించినప్పుడు సమపాళ్లలో లవణాలు ఉన్నాయని తేలిందన్నారు. వాటర్ ట్యాంకుల నుంచి పైపుల ద్వారా ఇంటింటికీ వస్తున్న భగీరథ నీటిని తాగుటకు మాత్రమే వినియోగించాలన్నారు. అధికంగా నీరు రావాలనే ఉద్దేశంతో కొంత మంది వ్యక్తులు నల్లా కనెక్షన్ వద్ద సిబ్బంది బిగించిన ఎఫ్‌సీవీ(ఫ్లో కంట్రోల్ వాల్)ని తొలగిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, గ్రామస్తులు ఉన్నారు.