సదాశివపేట, డిసెంబర్ 12: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కేంద్రాల్లో దళారులదే రాజ్యంగా నడుస్తోంది. పత్తి పంటకు దళారులే ధరను నిర్ణయించి సీసీఐ కేంద్రాల్లో బినామీ పేర్లతో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు ఒక ధర చెప్పి పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను దళారులు పొందుతున్నారు. ఒక్కో వాహనానికి దాదాపు రూ. 20 నుంచి రూ. 25వేల వరకు లాభం పొంది రైతులను ముంచుతున్నారు. ఈ ఏడాది సదాశివపేట మండలంలో 33 వేల ఎకరాల్లో పత్తి పంటను సాగైంది. ఎకరాకు 12 క్వింటాళ్ల మేర పత్తి దిగుబడి రావాల్సి ఉండగా, అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతిని ఎకరాకు 6 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు.
సదాశివపేట మండలంలో 3 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 3,039 రైతుల వద్ద నుంచి 98,227 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. కాగా, సీసీఐ కేంద్రాల వద్దనే దళారులు బహిరంగంగా పత్తిని కొనుగోలు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు చేయకపోవడంతో దళారులు రెచ్చిపోతున్నారు. సీసీఐకి నేరుగా పత్తిని తీసుకెళ్తే తేమ పేరిట కొర్రీలు పెట్టడం, అధికారులతో మాట్లాడేందుకు భాష రాకపోవడంతో రైతులు గత్యంతరం లేక దళారులకు పత్తిని విక్రయిస్తున్నారు.
దళారులు రూ. 6,300 నుంచి రూ. 6,500 వరకు రైతుల వద్ద పత్తిని కొని సీసీఐకి తీసుకెళ్లి బినామీ రైతుల పేరిట రూ.7200 నుంచి రూ. 7,500 ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పత్తి పం ట వివరాలు ఆన్లైన్లో లేకపోవడం, గ్రామస్థాయి వ్యవసాయాధికారులు పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. దీనిని ఆసరా చేసుకుని దళారులు బినామీ రైతుల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, పట్టాపాసుపుస్తకం ఇచ్చి సీసీఐ కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. సీసీఐ కేంద్రాల వద్ద మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ కరువైంది. అధికారుల అండతోనే అక్రమ కొనుగోళ్లు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.