సిద్దిపేట అర్బన్, మే 1: గొర్రెల పంపిణీ పథకం ద్వారా రెండో విడతలో సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే 17 వేల మంది లబ్ధిదారులతో సభ నిర్వహిస్తామన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని పొన్నాల గ్రామ శివారులోని బైరి అంజయ్య గార్డెన్లో రెండో విడత గొర్రెల పంపిణీ పై అవగాహన సదస్సు జరిగింది. జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 17 వేల మందికి రెండో విడతలో గొర్లు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ ప్రక్రియమొత్తం రెండు మూడు నెలల్లో పూర్తి చేసుకుందామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదని, 17 వేల మందికి తప్పకుండా గొర్రెలు పంపిణీ చేస్తామన్నారు. ఎలాంటి పైరవీకారులు,రూపాయి లంచం లేకుండా తమకు కేటాయించిన జిల్లాల్లోని ఇష్టమైన ప్రదేశంలో గొర్లు తెచ్చుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఇందుకు సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు సహకరించాలన్నారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్లకుర్మలు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. ఒక ఇంటికి రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఉచిత కరెంట్, కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ కిట్.. ఇలా అనేక పథకాలు వస్తున్నాయన్నారు. ఈ పథకాలన్నీ గత ప్రభుత్వ హయాంలో వచ్చాయా.. అని అడిగారు. మాట తప్పని.. మడమ తిప్పని వంశం గొల్లకుర్మ వంశమని.. సద్దితిన్న రేవు తలవాలన్నారు. గొల్లకుర్మ జాతి గౌరవం పెంచిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలన్నారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి వద్ద మొదటి దర్శనం గొల్లకుర్మలకే ఉంటుందన్నారు. శ్రీకృష్ణడు ధర్మం వైపు నిలబడ్డట్టు.. గొల్లకుర్మలు కూడా ధర్మం వైపు నిలబడాలన్నారు.
తెలంగాణ ఆచరిస్తుంటే.. దేశం అనుసరిస్తుంది
దేశానికే దశ-దిశా చూపించే విధంగా తెలంగాణ జాతి గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని మంత్రి అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంటే.. దేశం అనుసరిస్తుందన్నారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ఏం చేస్తే దేశం అదే చేస్తుందన్నారు. అన్ని వర్గాలను కాపాడుతున్న సీఎం కేసీఆర్ వైపే మనం నిలబడాలన్నారు. నాడు కందూకూరి వీరేశలింగం, మహాత్మాజ్యోతిబాఫూలే, రాజారామ్మోహన్రాయ్ బాల్యవివాహాల కోసం పోరాటం చేశారని.. కానీ పూర్తి స్థాయిలో వివాహాలు ఆగలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ తెచ్చిన ఒక గొప్ప సామాజిక విప్లవం కల్యాణలక్ష్మి పథకం అన్నా రు. ఈ పథకం వచ్చాక.. తెలంగాణలో బాల్యవివాహాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు. కల్యాణలక్ష్మి ద్వారా అన్ని వర్గాలకు లాభం చేకూరిందన్నారు. గొల్లకుర్మలకు రాజకీయంగా ఎంతో అవకాశం ఇచ్చారన్నారు. జిల్లాలోని మూడు దేవాలయాలకు మొదటిసారి గొల్లకుర్మలకే చైర్మన్లుగా అవకాశం కల్పించారన్నారు.
గొల్లకుర్మల్లో గొప్ప నైపుణ్యం
పుట్టుకతోనే గొల్లకుర్మలకు గొప్ప నైపుణ్యం ఉంటుంది. గొల్లకుర్మలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంక్షేమ పథకాలు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నాయి. ప్రధాని మోదీ తెలంగాణపై కక్ష సాధిస్తున్నారు. తెలంగాణ ప్రజల సంపదను దగ్గర పెట్టుకొని కేంద్రం న్యాయంగా రాష్ర్టానికి దక్కాల్సిన వాటా ఇవ్వడం లేదు.
– ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే
స్వరాష్ట్రంలో అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి
దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా జరపాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోలేదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. సీఎం కేసీఆర్ దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా జరపాలని ఉత్తర్వులు ఇచ్చారని గుర్తుచేశారు. సిద్దిపేటలో యాదవుల కోసం బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ నిర్మించామని.. కుర్మల ఫంక్షన్ హాల్ నిర్మాణంలో ఉందని.. ఎన్ని డబ్బులైనా ఖర్చుచేసి పూర్తి చేపిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలోని కోకాపేట్లో గొల్లకుర్మల ఆత్మగౌరవ భవనాలు పూర్తయ్యాయని.. త్వరలోనే బ్రహ్మాండంగా వాటిని ప్రారంభించుకుంటామన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ఎక్కడ బీరప్ప జాతర ఉన్నా.. హాజరవుతానని.. ఆపద అయినా.. పండుగ అయినా.. మీతోనే ఉంటానని మంత్రి పేర్కొన్నారు. అడవుల్లో గొర్రెలు వెళ్లే విధంగా అటవీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక.. కొమురవెల్లి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. మల్లన్న స్వామి దయతో కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఎంత ఇబ్బంది పెట్టినా.. మల్లన్నసాగర్ ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసుకున్నామన్నారు. పూర్తి చేసుకోవడమే కాకుండా గోదావరి నీళ్లతో మల్లన్న పాదాలు కడిగినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, పలు మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, గొర్రకాపర్ల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాలు ఆర్థికంగా బలపడుతున్నాయి
స్వరాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడింది. ఇది సీఎం కేసీఆర్ కృషి వల్లనే సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఎన్నో ప్రభుత్వాలను చూశాం. కానీ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ లాంటి పథకాలు లేవు. తెలంగాణ రాష్ట్రం చేపలు, గొర్రెలు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. తెలంగాణలో ప్రతి బిడ్డ సీఎం కేసీఆర్‌కు మద్దతివ్వాలి.
– వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్
కులవృత్తులకు గౌరవం
దేశంలో కుల వృత్తులకు గౌరవం ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్. సిద్దిపేటలో ఏ కార్యక్రమం అమలు చేసినా రాష్ట్రమంతా అమలు చేస్తారు. మనుషులకు హాస్టళ్లు ఉంటాయని.. మనకు తెలుసు.. కానీ పశువులకు హాస్టళ్లు నిర్మించిన ఘనత మంత్రి హరీశ్‌రావుకే దక్కింది. తెలంగాణలో ఉన్న పథకాలు ఏ రాష్ట్రంలో అమలుకావడం లేదు.
– వేలేటి రోజాశర్మ,
సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్ పర్సన్
అభివృద్ధిలో దేశానికే ఆదర్శం అభివృద్ధిలో సిద్దిపేట జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ వచ్చిన తర్వాతనే గొల్లకుర్మలకు లబ్ధి చేకూరింది. గొలకుర్మలను సీఎం కేసీఆర్ఆదుకుం టున్నారు. మీ అందరి సహకారం, ఆశీర్వాదం సీఎం
కేసీఆర్‌కు ఎల్లవేళలా ఉండాలి.
– యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
అవగాహన సదస్సులు నిర్వహించాం
మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ అధికారులతో జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో గొర్రెల పంపిణీ పథకంపై అవగాహన కల్పించాం. సిద్దిపేట జిల్లాకు గొర్రెలు తీసుకువచ్చేందుకు ఇప్పటికే ఇతర రాష్ర్టాల్లో అధికారులు పర్యటించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గొర్రెల పంపిణీ పథకాన్ని విజయవంతం చేస్తాం.
– ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట జిల్లా కలెక్టర్
గొల్లకుర్మలంటే ఎంతో ప్రేమ
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు గొల్లకుర్మలంటే ఎంతో ప్రేమ. గొల్లకుర్మల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఎంపికైన ప్రతి లబ్ధిదారుడికి గొర్రెల పంపిణీ పథకం వర్తిస్తుంది. ఎవరూ భయపడొద్దు తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో ఒక సామాజిక వర్గానికి నిధులు కేటాయించలేదు.
– శ్రీహరి యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ చైర్మన్