పటాన్చెరు రూరల్, జూలై 7 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి మృతిచెందిన 42 మందికి రూ. కోటి పరిహారంతో పాటు కేంద్రం ప్రకటించిన రూ. 2లక్షల నష్టపరిహారం రావాలంటే డెత్ సర్టిఫికెట్ కీలకం కానుంది. ఈ ప్రమాదంలో కనిపించకుండా పోయిన ఎనిమిది మంది కార్మికులు, సిబ్బంది విషయంలో పలు అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. ఘటనా స్థలంలోనే మృతిచెందిన వారికి ఇస్నాపూర్ మున్సిపాలిటీ విభాగం డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. మృతి చెందినవారి జాబితాను కంపెనీ ప్రతినిధులు పోలీసులకు అందజేస్తారు. వారు అందజేసిన జాబితాపై పోలీసులు దర్యాప్తు చేస్తారు. దీనిని రెవెన్యూ యంత్రాంగం పంచనామా నిర్వహిస్తుంది. రెవెన్యూశాఖ ఇచ్చిన నివేదికను అనుసరించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్సిడెంటల్ డెత్‌గా ధ్రువీకరిస్తారు. ఈ ధ్రువీకరణ పత్రం ఇస్నాపూర్ మున్సిపాలిటీకి అందజేస్తారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తుల వారసులకు మున్సిపాలిటీ విభాగం డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. దీంతో పాటు పలు దవాఖానల్లో మృతిచెందిన వారి బంధువులకు దవాఖాన ఉన్న మున్సిపల్ పరిధిలో ఇదే విధానంలో డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. డెత్ సర్టిఫికెట్ కోసం ఆధార్ కార్డు, నివాస ధ్రువపత్రం, ఇతర ధ్రువీకరణ పత్రాలను మున్సిపాలిటీకి సమర్పించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్ సరిగ్గా ఉండాలంటే బ్యాంకులో ఉన్న పేర్లు, ఆధార్ కార్డులో ఉన్న పేర్లు, తండ్రి పేరు, తల్లి పేరులో ఎలాంటి తప్పిదం ఉండకుండా చూసుకోవాలి. బ్యాంకుకు నష్టపరిహారం డబ్బులు రావాలంటే వారసుల అకౌంట్లో పేరు సరిగ్గా ఉండాలి.
డెత్ సర్టిఫికెట్స్ పొందటం ఎక్స్‌గ్రేషియాకు కీలకం కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన మృతుల బంధువుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొందరు మరణించిన వ్యక్తుల మృతదేహాలతో పాటుగా బీహార్, యూపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీకి వెళ్లిపోయారు. వారి వారసులకు డెత్ సర్టిఫికెట్ ఎక్కడిస్తారో తెలియదు. నష్టపరిహారం పొందేందుకు ఏమేమి చేయాలో అసలే తెలియదు. ఎక్కువ శాతం నిరక్షరాస్యులు, వృద్ధులు ఉన్నారు. వారిని ఇక్కడికి రప్పించి డెత్ సర్టిఫికెట్స్ అందజేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఇతర రాష్ర్టాల నోడల్ అధికారులు ఈ ప్రమాదంపై విచారణ నిమిత్తం సిగాచికి వచ్చారు. ఇతర రాష్ర్టాల అధికారుల రిపోర్టులను పరిగణలోకి తీసుకుని డెత్ సర్టిఫికెట్, దాంతో పాటు సరైన వారసులకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది. రూ. కోటి నష్టపరిహారం అనేసరికి అసాంఘిక శక్తులు కూడా రంగప్రవేశం చేసి నిరక్షరాస్యుల నోట్లో మట్టికొట్టే అవకాశం ఉంది. సర్టిఫికెట్లు వారసులకు కాకుండా ఇతరులకు చిక్కితే మోసానికి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పటాన్చెరు ఏరియా దవాఖానలోని మార్చురీకి మృతిచెందిన వ్యక్తి భార్యను అని ఒక మహిళ వచ్చి రాద్ధాంతం చేసి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మహిళకు మరణించిన వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని వారి బంధువులు చెప్పడంతో కథ సుఖాంతమైంది. మరో వ్యక్తి తన మిత్రుడు మనోహార్‌రెడ్డి అనే వ్యక్తి కంపెనీలో మృతిచెందాడని పటాన్చెరు దవాఖాన వద్దకు వచ్చి హల్చల్ చేశాడు. ఆ వ్యక్తి పేర్కొన్న పేరుతో జాబితాలో ఎవరూ లేకపోవడం అతడు అక్కడి నుంచి జారుకున్నాడు. రూ. కోటి కంపెనీ, రూ. లక్ష రాష్ట్ర ప్రభుత్వం, రూ. 2లక్షలు కేంద్రం నష్టపరిహారం చెల్లిస్తున్నాయి. మరో పక్క అంత్యక్రియలకు రూ. 10వేల నగదు ఇస్తున్నారు.
సిగాచి ప్రమాదంలో జాడలేకుండా పోయిన వ్యక్తుల విషయంలోనూ జిల్లా అధికార యంత్రాం గం ఒక విధి, విధానాన్ని అమలు చేయనున్నది. ఇప్పటి వరకైతే ప్రమాదం జరిగిన పరిశ్రమ యాజమాన్యం తమ వద్ద ఉన్న అటెండెన్స్, లోపలికి వచ్చినట్లుగా నమోదైన బయోమెట్రిక్ ఎవిడెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అందజేస్తారు. విధులకు వచ్చిన వారి వివరాలను దర్యాప్తు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు. అదే సమయంలో రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహిస్తారు. ప్రమాదం జరిగి లోపలే వారు కాలిపోయినట్లుగా పోలీసులు రిపోర్టు ఇస్తారు. ఈ రిపోర్టు జాబితాను ఇస్నాపూర్ మున్సిపాలిటీకి అందిస్తారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ కాలిపోయి మిస్సయినట్లుగా గుర్తించి వారికి డెత్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో డెత్ సర్టిఫికెట్స్ జారీ, మిస్సింగ్ వ్యక్తులకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఒక విధి, విధానంతో పాటు ఫార్మ్ ప్రకారం సర్టిఫై చేయాలనే దిశగా పోతున్నారు. రెండు రోజుల్లో డెత్ సర్టిఫికెట్స్ జారీ ప్రక్రియను మొదలు పెట్టేందుకు కార్యాచరణ ప్రారంభంకానుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీతో పాటు చికిత్స పొందుతూ చనిపోయిన దవాఖాన ఉన్న మున్సిపాలిటీల్లో డెత్ సర్టిఫికెట్ పొందేందుకు పోలీసులు దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వనున్నారు. ఎక్కడ చనిపోతే అదే ప్రాంతం నుంచి డెత్ సర్టిఫికెట్ పొందాలనేది రూల్.