హుస్నాబాద్ టౌన్, ఫిబ్రవరి 23: లక్షలాది రూపాయల వ్యాపారాలు సాగించే వ్యాపారసంస్థలకు ట్రేడ్ లైసెన్సులు జారీచేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చిన్న వ్యాపారులకు మాత్రం నోటీసులు జారీచేస్తూ హెచ్చరిస్తున్నారు. బల్దియా అధికారుల తీరుతో ఆదాయానికి గండిపడుతున్నది. హుస్నాబాద్‌లో పట్టణంలోని హన్మకొండ రోడ్లో మూడేండ్ల క్రితం లక్షల రూపాయల వ్యాపారం నిర్వహించే షోరూంను ప్రారంభించారు. మూడేండ్లగా ఆ షోరూంకు ట్రేడ్ లైసెన్సును అధికారులు జారీచేయలేదు. పైగా మేము నోటీసులు ఇస్తున్నాం… అని చెప్పి అధికారులు తప్పుకుంటున్నారు. మూడేండ్లుగా దాదాపు లక్షరూపాయల వరకు ఆదాయాన్ని మునిసిపాలిటీ కోల్పోయింది.
ఇదక్కొటే కాదు. ఇలా పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించే సంస్థలకు లైసెన్సులు జారీ చేయకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఇప్పటి వరకు 600 మంది వ్యాపారులకు బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్సులు జారీచేశారు. ఇందులో ప్రమాదాలకు సంబంధించి, జనరల్, పరిశ్రమలకు సంబంధించి మూడు రకాల లైసెన్సులను జారీచేశారు. కిరాణం, హోటల్స్, మాల్స్, థియేటర్లు, కబ్లు, బేకరీలు, సిమెంట్, స్టీల్, పటాకులు, పరిశ్రమలకు సంబంధించిన వారికి ఇప్పటి వరకు లైసెన్సులు జారీచేశారు.
ట్రేడ్ లైసెన్సుల జారీ, రెన్యువల్ కోసం ప్రత్యేకంగా మున్సిపల్ నుంచి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సీహెచ్. బాలఎల్లం, జూనియర్ అసిస్టెంట్ జాలిగాం శంకర్ ఆధ్వర్యంలో వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారు. లైసెన్సులు తీసుకోని వ్యాపారాలను గుర్తించి సీజ్ చేసేందుకు సైతం ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. మరో 400 పైగా దుకాణాలకు లైసెన్సులు జారీచేయాలని భావిస్తున్నా, ఆచరణలో మాత్రం ఆ పరిస్థితి లేక పోవడం అనుమానాలకు తావిస్తున్నది.
పలువురు వ్యాపారాలు పట్ల మున్సిపల్ సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారాలు నిర్వహించే దుకాణాలకు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని మున్సిపల్ చట్టం చెబుతున్నది. కానీ, జారీచేసే విషయంలో ఆలసత్వం ఎందుకనేది ఎవరికీ అంతుబట్టడంలేదు. పైగా కొందరు వ్యాపార సంస్థల పరిధిలో కొలతలు తక్కువగా చూపించి లైసెన్సు ఫీజు నమోదు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవంగా క్షేత్రస్థాయిలో అధికారులు సరైన విధంగా పట్టించుకోకపోవడంతోనే మున్సిపల్ ఆదాయానికి గండిపడుతున్నదని ఆరోపణలు ఉన్నాయి.
పట్టణంలో ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్న యజమానులు ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి. లైసెన్సు ఉన్నవారు రెన్యువల్ చేసుకోవాలని నోటీసులు అందజేస్తున్నాం. లైసెన్సులు తీసుకోని పక్షంలో వారి దుకాణాలను చట్టప్రకారం సీజ్‌చేస్తాం. వ్యాపారులు నిబంధనలు తప్పక పాటించాలి.
-బాల ఎల్లం, శానిటరీ ఇన్స్పెక్టర్ హుస్నాబాద్