రామాయంపేట, మే 7: కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన రామాయంపేట పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్నది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. రామాయంపేట పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా హవేళీఘన్‌పూర్ మండలం లింగసానిపల్లికు చెందిన దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో దైవదర్శనం కోసం యాదగిరిగుట్టకు కారులో బయలుదేరాడు. అతివేగం కారణంగా రామాయంపేట బస్టాండ్ వద్ద అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటున్నవారిపైకి దూసుకెళ్లింది. మామిడిపండ్లు విక్రయిస్తున్న మహిళ పొట్ట భాగం పైనుంచి కారు టైర్లు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే విగత జీవగా మారింది. గాయాల పాలైన ముగ్గురిని 108 అంబులెన్సులో ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మృతురాలు రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామానికి చెందిన పున్న రేణుక (55)గా గుర్తించారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న కోటం గంగామణి, జలగడుగుల సత్యం, రింకు విశ్వకర్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మొదట రామాయంపేట పీహెచ్‌సీకి, తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్నవారికి ఎలాంటి గాయాలూ కాలేదు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ దుర్గాప్రసాద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రేణుక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.
పండ్లు విక్రయించి పొట్ట పోసుకుంటూ… 
డి.ధర్మారం గ్రామానికి చెందిన దంపతులు రేణుక-కిషన్ కొంతకాలంగా రామాయంపేటలో పండ్లు విక్రయిస్తూ కడుపు నింపుకొంటున్నారు. కారు రూపంలో వచ్చిన మృత్యువు తన భార్యను కబళించడంతో కిషన్ కన్నీరు మున్నీరయ్యాడు. ఎప్పటిలాగే మామిడి పండ్లు విక్రయించేందుకు తన భార్య రేణుకతో రామాయంపేటకు వచ్చిన కిషన్ ఆమెను బస్టాండ్ ప్రాంతంలో విడిచిపెట్టాడు. అతను మరో ప్రాంతంలో పండ్లు విక్రయించేందుకు వెళ్లాడు. కాగా, అనుకోని ప్రమాదంలో రేణుక ప్రాణాలు కోల్పోయింది. మృతురాలికి ఇద్దరు కొడుకులున్నారు. వారికి పెళ్లిళ్లు కాగా, బతుకుదెరువు కోసం ఆర్మూరు ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉపాధి పొందుతున్నారు. రేణుక మృతితో ఆమె స్వగ్రామం డి.ధర్మారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.