నర్సాపూర్, ఏప్రిల్ 26: ఫంక్షన్‌కు వెళ్దామంటూ ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరిన ఘటన నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దచింతకుంట సమీపంలో ఉన్న జలహనుమాన్ ఆలయం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌడిపల్లి మండలం వెంకట్రావ్‌పేట్ గ్రామానికి చెందిన మాల గోపాల్ తన భార్య పూజ, కొడుకు అనుదీప్, బంధువుల కూతురు సహస్రతో కలిసి ఫంక్షన్ ఉన్నదని వెంకట్రావ్‌పేట్ నుంచి నర్సాపూర్‌కు బయలుదేరారు.
మండలంలోని పెద్దచింతకుంట సమీపంలోని జలహనుమాన్ ఆలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. కింద పడిపోయారు. ఆ సమయంలోనే ఎదురుగా వస్తున్న లారీ వాళ్ల మీదుగా వెళ్లింది. ఈ ప్రమాదంలో గోపాల్, తన కుమారుడు అనుదీప్, బంధువుల కూతురు సహస్ర అక్కడికక్కడే మృతి చెందా రు. గోపాల్ భార్య పూజని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. ఇంటి నుంచి బయలుదేరిన 15 నిమిషాలు గడిచిన తర్వాత మరణవార్త విన్న మిగతా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.