జహీరాబాద్, డిసెంబర్ 24 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుడితే, కాం గ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపి రైతుల నోట్లో మట్టికొట్టిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్హాల్లో బుధవారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను ఆయన ఘనంగా సన్నానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పోలీస్ బలగాలు, అధికారాన్ని ఉపయోగించినా జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుతో 52 సర్పంచ్‌లు గెలుపొందడం గొప్ప విషయమన్నారు. కారు గుర్తు లేకుంటేనే అన్ని స్థానాలు గెలిచాం, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు గుర్తుంటే మరిన్ని స్థానాలు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే రేవంత్‌రెడ్డి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు జంకుతున్నాడన్నారు. బీఆర్ఎస్ను మొలకెత్తనీయనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నాడు కానీ, తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు.
పార్టీపై ఉన్న అభిమానంతో ప్రజలు రాష్ట్రంలో నాలుగు వేల సర్పంచ్‌లు గెలుపొందారన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు పత్తాలేకుండాపోయాయన్నారు. వృద్ధులకు 4వేల పింఛన్, మహిళలకు రూ.2500, అడపిల్లలకు తులం బంగారం రాలేదన్నారు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిన్ కిట్టు పోయిందన్నారు. చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ బంద్ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో జహీరాబాద్ నియోజకవర్గంలో కట్టించిన మైనార్టీ గురుకుల కళాశాలల్లో చదివిన 19 మంది డాక్టర్లు అయ్యారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో గురుకుల పాఠశాల, కళాళాలల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు.

Harishrao
విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. కల్తీ ఆహారంతో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగానికి సాగునీరందించేందుకు కాళేశ్వరం నీళ్లు జహీరాబాద్ ప్రాంతానికి తేవాలని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలు ప్రారంభించుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులు ఆగిపోయాయని, ఎందుకు ఆపారని, జిల్లా మంత్రి ఎందుకు రేవంత్‌రెడ్డిని ప్రశ్నించడం లేదన్నారు. ఎత్తిపోతల పథకాల పనుల కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేసి, ప్రభుత్వ మెడలు వంచి ప్రాజెక్టు పనులు ముందుకు పోయేలా చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తే, రేవంత్‌రెడ్డి పాలనలో 12 గంటల మాత్రమే సరఫరా చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జహీరాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్ల కేటాయించిందన్నారు. రైల్వే ైప్లెఓవర్ బ్రిడ్జి, బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. జహీరాబాద్ పర్యటనలో రేవంత్‌రెడ్డి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేపట్టిన వాటికి రిబ్బన్ కట్ చేసి పైసా కూడా ఇవ్వలేదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయసాధించిన స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజా సేవకు పునరంకితమై భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
రానున్న మున్సిపాలిటీ ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని, అన్ని స్థానాల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రానున్న రెండేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతాప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.