నర్సాపూర్, మార్చి 13: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ జీవో తెచ్చి దొంగ సర్వే చేసి దొడ్డిదారిన డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపడుతుందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా నర్సాపూర్‌లో జేఏసీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారానికి 25వ రోజుకు చేరుకున్నది.
గురువారం బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాధ మల్లేష్ గౌడ్ నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను సేకరించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా సర్వే చేసి డంపింగ్ యార్డ్ నిర్మిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డంపింగ్ యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పచ్చని అడవిలో 152 ఎకరాలలో పోలీస్ పహారా మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఈ డంపింగ్ ఏర్పాటుతో సుమారు 13 కిలోమీటర్ల వరకు దుర్గంధం వస్తుందని, దీంతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ సైతం ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని రాధ మల్లేష్ గౌడ్ కోరారు. డంపింగ్ యార్డ్ పేరుతో ప్రజల నెత్తిన విష కుంపటి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సుబ్రహ్మణ్యం, బీజేపీ నేతలు రమేష్ గౌడ్, నారాయణ రెడ్డి, దిగంబర్ రావు, గుండం శంకర్, శేఖర్ గుప్తా, రాజు, బాదే బాలరాజ్, శ్రీకాంత్, ఉదయ్ గౌడ్ సంగమేశ్వర్, గిరి తదితరులు పాల్గొన్నారు.