సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 27: నాడు కన్న కలలు నేడు నిజమవుతున్నాయని.. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేటకు ఒక్కొక్కటిగా అన్నీ చేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట కోమటి చెరువు వేదికగా ఆదివారం రాత్రి 450 డ్రోన్ కెమెరాలతో నిర్వహించిన డ్రోన్‌షో అలరించింది.వేలాది మంది తరలిరాగా కోమటి చెరువు జనంతో కిక్కిరిసి పోయింది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, టూరిజం, ఎక్సైజ్ శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దసరా నాటికి నెక్లెస్ రోడ్ పూర్తి…
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో డ్రోన్ షో ఏర్పాటు చేశారన్నారు. అది చూసిన తనకు సిద్దిపేట వాసులకు డ్రోన్ షో చూపించాలని ఆశ పడ్డానని.. నేడు అది సాకారం చేశానని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దసరా నాటికి నెక్లెస్ రోడ్ పూర్తి అవుతుందని తెలిపారు. సై రెస్టారెంట్, టన్నెల ఆక్వేరియం, వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్ మంజూరు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరుతున్నట్లు తెలిపారు. సిద్దిపేట అద్భుతమైన పర్యాటక ప్రాంతం అవుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో జిల్లా వాసుల స్వప్నాలన్నీ సాకారం అయినట్లు తెలిపారు. కోమటి చెరువుకు గోదావరి నీళ్లు వచ్చాయని, నెలలోపు రియల్ రైల్ రాబోతోందన్నారు. నాటి కలలు నేడు నిజమయ్యాయని తెలిపారు. రాబోయే రోజుల్లో రంగనాయక సాగర్ డెస్టినేషన్ సెంటర్ కాబోతోందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
ఆదర్శప్రాయుడు మంత్రి హరీశ్‌రావు…
ఈ సందర్భంగా టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అందరికీ ఆదర్శప్రాయుడు మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎకడ ఏది ఉన్నా అది సిద్దిపేటకు కావాలని కోరుకునే వ్యక్తి, హరీశ్‌రావుకు సిద్దిపేట గుండెకాయ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి ఆయన అని, సిద్దిపేట అభివృద్ధికి ఐకాన్‌గా మారిందన్నారు. ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో అండగా నిలిచామన్నారు. ఆరోగ్యం, విద్య అన్నింటిలో సిద్దిపేట ముందున్నదని, హరీశ్‌రావు స్ఫూర్తితో తామంతా జనంలోనే ఉంటున్నట్లు చెప్పారు. పని చేయడంలో హరీశ్‌రావు స్ఫూర్తి అని తెలిపారు. సిద్దిపేట మరో సింగపూర్ కానుందని మంత్రి అన్నారు. ఇండోర్ స్టేడియం త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. తెలంగాణకు సిద్దిపేట మోడల్ అని, సిద్దిపేటకు రావడం అంటే స్టడీ టూర్‌కు వచ్చినట్టే ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని మంత్రి తెలిపారు.
కనువిందు చేసిన డ్రోన్ షో..
సిద్దిపేట కోమటిచెరువుపై గల నెక్లెస్ రోడ్లో ఆదివారం రాత్రి సుమారు 450 డ్రోన్లతో ఏర్పాటు చేసిన డ్రోన్ షో వీక్షకులను కనువిందు చేసింది. మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి డ్రోన్ షోను ప్రారంభించారు. సరిగ్గా 8గంటలకు ప్రారంభమైన డ్రోన్ షో 12 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో ముందుగా తెలంగాణ ఆకృతి, కోటిలింగాల ఆలయం, సిద్దిపేట లాల్ కమాన్, తెలంగాణ అమరవీరుల స్తూపం, రంగనాయకసాగర్, ఐటీ హబ్, సిద్దిపేట మెడికల్ కాలేజీ, కోమటి చెరువు సస్పెన్షన్ బ్రిడ్జి, బతుకమ్మ చిత్రం, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ఫొటోలు, పేరిణీ నృత్యం చేస్తున్న వ్యక్తి ఫొటో, జైతెలంగాణ, జై సిద్దిపేట అక్షరాలు డ్రోన్ షో ద్వారా ఆకాశంలో కనువిందు చేశాయి. అనంతరం ఫైర్ షో నిర్వహించారు. ఇవే కాకుండా ప్రముఖ గాయని గీతామాధురి ఆధ్వర్యంలో నిర్వహించిన సింగింగ్ షో అందరినీ అలరించింది. మెగా డ్రోన్ షోకు విస్తృత ప్రచారం కల్పించడంతో వీక్షించేందుకు సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలను నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. కోమటి చెరువు ఆనకట్ట పూర్తిగా జనసంద్రంగా మారింది. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, జిల్లా జడ్జి రఘురాం,కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.