గజ్వేల్, మే 14: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భూసార పరీక్ష కేంద్రం అలంకారపాయంగా మారింది. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనం నియోపయోగంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపక పోవడంతో భూసార పరీక్ష కేంద్రం ఉన్నా రైతులకు ప్రయోజనం చేకూరడం లేదు. వర్షాకాలం సీజన్‌కు ముందు వ్యవసాయ భూముల్లో మట్టి పరీక్షలు చేసి రైతులకు ఎరువుల వాడకంపై అధికారులు తగు సలహాలు, సూచనలు చేయాల్సి ఉంటుంది.
ఈ ఉద్దేశంతోనే గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.81.20 లక్షలతో భూసార పరీక్ష కేంద్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని 2023లో ప్రారంభించారు. ప్రారంభించిన తరువాత కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడంతో అప్పట్లో భూసార పరీక్ష కేంద్రానికి సరిపడా పరికరాలు సమకూర్చ లేకపోయారు. భూసార పరీక్ష కేం ద్రంలో పరికరాలతో పాటు సిబ్బందిని నియమించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భూసార పరీక్ష కేంద్రంలో ఇప్పటి వరకు ఎలాంటి భూసార పరీక్షలు చేయలేకపోయారు.
గజ్వేల్‌లోని భూసార పరీక్ష కేంద్రానికి ఏడీఏతో పాటు ఏవోలు, ఏఈవోలు, ల్యాబ్ అసిస్టెంట్లు, అటెండర్లను నియమించాల్సి ఉంది. ప్రస్తు తం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఒక్కటే భూసార పరీక్ష కేంద్రం రైతులకు అందుబాటులో ఉంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు మట్టిని అక్కడికి తీసుకెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీంతో దూరభారంతో పాటు ఆలస్యం జరుగుతున్నది. చాలామంది రైతులు భూసార పరీక్షలకు ముందుకు రావడం లేదు.
భూసార పరీక్షలతో రైతులకు మేలు…
భూసార పరీక్షలతో రైతులకు మేలు జరుగుతుంది. రైతులు సాగుచేసే భూమిలో మట్టి పరీక్షలు చేసి సాగు భూమికి అనుగుణంగా పంటలతో పాటు అవసరమైన మేర ఎరువులను వేసుకునే వెసులుబాటు ఉంటుంది. భూసార పరీలు చేయకపోవడంతో రైతులు ఇష్టానుసారంగా ఎరువులను అధికంగా వినియోగిస్తున్నారు. అదే విధంగా ఒకే రకమైన పంటలను సాగు చేయడంతో సరైన దిగుబడి రాక అనేక రకాలుగా నష్టాలకు గురవుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా సుమారుగా 6లక్షల ఎకరా ల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. నేల స్వభావం తెలియక రైతులు ఇష్టానుసారంగా ఎరువుల వాడడంతో దిగుబడులు తగ్గడం, పెరగడం నేల స్వభావాన్ని కోల్పోవడంతో పాటు రైతులపై ఆర్థికభారం పడుతుంది. అదే భూసార పరీక్షలు ఏటా నిర్వహిస్తే పోషక లోపాలను గుర్తించి అవసరమైన మేరకు ఎరువులను వినియోగించే అవకాశాలు ఉంటా యి. తద్వారా రైతులకు మేలు చేసిన వారవుతారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి భూసార పరీక్ష కేంద్రా ల్లో అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
విభిన్న పంటల సాగు…
గజ్వేల్ నియోజకవర్గ రైతులు వరి, మొక్కజొన్న, వేరుశనగతోపాటు కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా పండిస్తున్నారు. పలురకాల పూలు సాగుచేస్తున్నారు. ఈ ప్రాంత రైతులు పండించిన కూరగాయలను వంటిమామిడి మార్కెట్‌కు తరలిస్తుంటారు. మార్కెట్ కూరగాయల విక్రయాలకు చాలా ఫేమస్. వంటిమామిడి మార్కెట్ నుంచి నిత్యం హైదరాబాద్ తదితర ప్రాం తాలకు కూరగాయలు ఎగుమతి చేస్తుంటారు.
చాలామంది వ్యాపారులు వంటిమామిడి మార్కెట్‌కు వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి తీసుకెళ్లి అమ్ముతుంటారు. వంటిమామిడి మార్కెట్ నుం చి స్వీట్‌కార్న్ కొనుగోలు చేసుకెళ్లి మెదక్, మేడ్చల్-రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో చిరువ్యాపారులు విక్రయించి ఉపాధి పొందుతుంటారు. పంటల సాగులో ముందున్న గజ్వేల్ ప్రాంత రైతుల మేలు కోరి వెంటనే గజ్వేల్‌లో భూసార పరీక్ష కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.