మెదక్ మున్సిపాలిటీ, జనవరి 21: క్రీడల్లో 90 ఏండ్ల వృద్ధులు పాల్గొనడం చూస్తుంటే బాల్యం గుర్తుకొస్తుందని, క్రీడలకు వయస్సుతో పని లేదని పోటీల్లో పాల్గొన్న వృద్ధులు నిరూపిస్తున్నారని, యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 9వ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్-2023ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, శాఫ్ చైర్మన్ అంజనేయులుగౌడ్, రాష్ట్ర మాస్టార్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ లైఫ్‌టైం అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రభుకుమార్‌గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్, ఇప్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్‌తో కలిసి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జెండా ఆవిష్కరించి, క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, వారు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకున్నామని, నేడు యువత సెల్ ఫోన్లు, వీడియో గేమ్స్‌కు ఇస్తున్న ప్రాధాన్యత ఆటలకు ఇవ్వడం లేదన్నారు. 35 నుంచి 95 ఏండ్ల వయస్సు పైబడిన వారు ఈ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో పాల్గొన్న వారిని చూసి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మెదక్‌ను జిల్లా కేంద్రం ఏర్పాటు చేసుకుని ఇక్కడ రాష్ట్రస్థాయి పోటీలను ఎన్నో నిర్వహించుకున్నామన్నారు. స్టేడియంలో రూ.ఏడున్నర కోట్లతో సింథటిక్ ట్రాక్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. మున్ముందు రాష్ట్రస్థాయి పోటీలే కాదు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి పోటీలకైన మెదక్‌కు ప్రాధాన్యతనివ్వాలని శాఫ్ చైర్మన్‌కు సూచించారు. పోటీలకు వచ్చే క్రీడాకారుల కోసం వసతి గృహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఏప్రిల్‌లో మెదక్‌కు సీఎం కేసీఆర్ రానున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ పోటీల్లో విజేతలు ఫిబ్రవరిలో హరియాణాలోని కురుక్షేత్రలో జరిగే నేషనల్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారని, అక్కడ ప్రతిభ కనభర్చిన వారికి ఈ స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా క్రీడాకారులతో కలిసి షాట్‌పుట్ వేసి ఉత్సాహ పరిచారు. అంతకుముందు స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
వృద్ధుల పోటీతత్వాన్ని చూసి గర్వపడాలి
వృద్ధుల పోటీతత్వాన్ని చూసి తెలంగాణ యువతరం గర్వపడాలని శాప్ చైర్మన్ అంజనేయులుగౌడ్ అన్నారు. ఈ పోటీల్లో 90 ఏండ్లకు పైబడిన వృద్ధులు పాల్గొనడం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుందన్నారు. వృద్ధులను ఆదర్శంగా తీసుకుని యువత క్రీడల్లో రాణించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో క్రీడల్లో తెలంగాణ ఎంతో ముందుకెళ్లిందని తెలిపారు. ఇటీవలే జరిగిన జాతీయ క్రీడల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ప్రభుత్వం క్రీడలకు ఉపయోగిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి చిన్ననాడు క్రీడాకారిణి కావడంతోనే తెలంగాణ ఉద్యమంలో ఒక ఫైటర్‌గా నిలిచారన్నారు. ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి పేరులో దేవుడు ఉన్నారని, ఏది ప్రోత్సహించాలో వారికి తెలుసన్నారు. వారి సహకారంతో ఈ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యం కల్పించిన దేవేందర్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
– శాప్ చైర్మన్ అంజనేయులుగౌడ్
స్టేడియానికి కళ వచ్చింది..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అన్ని వయస్సుల క్రీడకారులు తరలిరావడంతో స్టేడియానికి కళ వచ్చిందని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. గతేడాది సైతం ఈ ట్రాక్‌పై రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించుకున్నామని, అదే స్ఫూర్తితో ఈ అథ్లెటిక్స్ మీట్‌ను విజయవంతంగా నిర్వహించుకుంటున్నామన్నారు. మున్ముందు ఎలాంటి పోటీలైనా నిర్వహించుకునేందుకు అందరి సహకారంతో ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామన్నారు.
– అసోసియేషన్ ఆర్గనైజింగ్ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి
715 మంది అథ్లెట్స్
మాస్టార్స్ అథ్లెటిక్స్ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 715 మంది అథ్లెట్స్ హాజరై, 23 క్రీడల్లో పాల్గొన్నారు. ఈ పోటీలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారు వచ్చే నెల 15, 16 తేదీల్లో హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే నేషనల్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొననున్నారు.
అట్టహాసంగా ప్రారంభం..
9వ తెలంగాణ స్టేట్ చాంపియన్‌షిప్-2023 పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివారంతో ఈ క్రీడలు ముగియనున్నాయి. తొలిరోజు విజేతలకు శాప్ చైర్మన్ అంజనేయలుగౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పతకాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, జిల్లా క్రీడల అధికారి నాగరాజు, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి శ్రీనివాస్‌రావు, జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివశంకర్‌రావు, స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్ అహ్మద్, స్పోర్ట్స్ ఫౌండేషన్ బాధ్యులు సకిలం శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు శ్రీనివాస్, లక్ష్మీనారాయణగౌడ్, వనజ, కోఆప్షన్ సభ్యుడు ఉమర్, పీఈటీలు మహిపాల్, శ్యామ్, రవి, కమాలొద్దీన్, రమేశ్, నరేశ్, సుజాత, బీఆర్ఎస్ నాయకులు గడ్డమీది కృష్ణాగౌడ్, అరవింద్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్, సంశాన్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలకు వయో పరిమితి లేదు
క్రీడలకు వయో పరిమితి లేదని, శారీరక దృఢత్వం, పోటీతత్వం, సంకల్పం గొప్పవని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. మెదక్‌లో జరుగుతున్న 9వ తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు హాజరై విజేతలకు పతకాలను బహూకరించారు. ఈ సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విజేతలను ఆమె అభినందించారు.