మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 25: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ కెథడ్రాల్ చర్చిలో క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం తెల్లవారుజామునే శిలువ ఊరేగింపుతో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరుణామయుడి జన్మదినాన క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే భక్తులు మెదక్ సీఎస్ఐకి తరలివచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. లోక రక్షక్షా ఏసు ప్రభువా కాపాడు అంటూ భక్తులు, సందర్శకులు ప్రార్థించారు. మొదటి ఆరాధనకు మెదక్ డయాసిస్ అధ్యక్ష మండల బిషప్ రెవరెండ్ పద్మారావు హాజరై భక్తులనుద్దేశించి వాక్యోపదేశం వినిపించారు.
క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ పండుగ.. క్రీస్తు రాక ఈ లోకానికి శుభసూచకమని మెదక్ ఇన్చార్జి బిషప్ రెవరెండ్ పద్మారావు అన్నారు. ఆకాశంలో తోక చుక్క ఉద్భవించగానే మన జీవితాలు మార్చడానికి వచ్చిన దేవుడే ఏసుప్రభువు అన్నారు. ప్రేమ, శాంతి, ఐక్యతే క్రిస్మస్ సందేశమన్నారు. ప్రజలు, క్రైస్తవులు, మహా దేవాలయానికి విచ్చేసిన భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసయ్య భక్తి గీతాలతో చర్చి మార్మోగింది. బిషప్ పద్మారావు, బిషపమ్మ విజయ, చర్చి కమిటీ సభ్యులు, పాస్టర్లతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి సీఎస్ఐ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 2024 సంవత్సరాంతం శతాబ్ది వేడుకలు నిర్వహిద్దామన్నారు.
మానవాళికి రక్షకుడు ఏసుప్రభువు అని మెదక్ చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య అన్నారు. రెండో ఆరాధన ప్రార్థన అనంతరం భక్తులనుద్దేశించి దైవ సందేశం వినిపించారు. క్రిస్మస్ అందరిదన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, జైపాల్, సువర్ణ, మెదక్ చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, శాంసన్ సందీప్, జాన్సన్, గెలెన్ చిత్తరంజన్, సువన్ డగ్లస్, భక్తులు పాల్గొన్నారు.
ఏసు ప్రభువు చూపిన బాటలో నడుచుకోవాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిని సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి గురువులు వారిని ఆశీర్వదించి, ఘనంగా సన్మానించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చర్చి గేటు ఎదుట క్రిస్మస్ కేక్‌ను పద్మాదేవేందర్‌రెడ్డి కట్ చేశారు. వారి వెంట జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్నిపల్ కౌన్సిలర్లు జయరాజు, లక్ష్మీనారాయణ, సమియోద్దీన్, కోఆప్షన్ సభ్యుడు ఫ్లారిన్ శాంసన్, సర్పంచ్‌లు దేవగౌడ్, మహిపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, జైపాల్‌రెడ్డి, శ్రీనునాయక్, ప్రశాంత్, మధు, కిరణ్, జుబేర్ తదితరులు ఉన్నారు.
ఏసుప్రభువు దీవెనలు ఎల్లావేళలా ఉండాలని, మెదక్ చర్చిని సందర్శించడం సంతోషంగా ఉన్నదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. క్రిస్మస్ పురస్కరించుకుని చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి గురువులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి, సన్మానించారు. అనంతరం చర్చిలో మత గరువులు, చర్చి కమిటీ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు జీవన్‌రావు, సుప్రభాత్రావు, అనిల్, బొజ్జ పవన్, ఉప్పల రాజేశ్, గోపాల్‌రెడ్డి, గుడూరి ఆంజనేయులు, లలూ, బోస్, పరశురామ్, బట్టి సాయి, జాయ్‌ముర్రే తదితరులు ఉన్నారు.
మెదక్ పట్టణంలో ఉన్న మహాదేవాలయం ఆసియా ఖండంలోనే రెండో పెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందిందని, వచ్చే క్రిస్మస్కు చర్చి వందేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించి శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఏసు ప్రభువు దీవెనలు ఎల్లావేళలా అందరిపై ఉండాలన్నారు. మెదక్ చర్చిని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు.
క్రిస్మస్ను పురస్కరించుకుని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సీఎస్ఐ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బస్సు డిపో ఎదురుగా గల మెయిన్ గేట్ నుంచి చర్చి ముఖద్వారం వరకు భారీకెడ్లు ఏర్పాటు చేశారు. చర్చి ప్రధాన ద్వారం వద్ద పోలీసులు మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ ఫణీంద్ర ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నారు.
మెదక్ అర్బన్, డిసెంబర్ 25: పటిష్ట భద్రత మధ్య మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్లు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ అన్నారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్‌లోని చర్చిలో ప్రార్థనలు చేసేందుకు భక్తులు భారీగా వచ్చారన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా, ఇబ్బందులు పడకుండా వేడుకలు జరుపుకొన్నారన్నారు. వాహనాల పార్కింగ్, పిక్ పాకెటింగ్, స్నాచింగ్ లాంటివి జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.